PM Modi Yoga : శ్రీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా సెషన్..
21 June 2024, 9:35 IST
శ్రీనగర్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా.. ప్రజలు యోగా చేయాలని పిలుపునిచ్చారు.
యోగా చేస్తున్న మోదీ..
PM Modi Yoga in Srinagar : ప్రపంచ యోగా దినోత్సవం నేపథ్యంలో.. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని షేర్-ఈ- కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్పరెన్స్ సెంటర్లో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అక్కడి ప్రజలతో కలిసి యోగా చేశారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు. 'మన సంక్షేమం.. ప్రపంచ సంక్షేమంతో ముడి పడి ఉంది' అని మోదీ అన్నారు. గత పదేళ్లల్లో యోగా చేసే వారి సంఖ్య పెరిగిందని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు.. 2014లో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. అప్పటి నుంచి ప్రతి యేటా 21న.. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది.
International Yoga Day 2024 : "ఈ యోగా దినోత్సవం నాడు ప్రపంచం నలుమూలల యోగా చేస్తున్న వారందరికి నా శుభాకాంక్షలు. యోగా డే చారిత్రక ప్రయాణానికి 10ఏళ్లు నిండింది. 2014లో యోగా దినోత్సవాన్ని నేను ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించాను. భారత దేశ ప్రతిపాదనను 177 దేశాలు అంగీకరించాయి. ఇదొక రికార్డు. అప్పటి నుంచి.. ఈ యోగా డే.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది," అని చెప్పుకొచ్చారు మోదీ.
ఇక ఈ ఏడాది.. ‘యోగా ఫర్ సెల్ఫ్, సొసైటీ’ థీమ్‌తో వేడుకలను నిర్వహిస్తోంది భారత్. కాగా.. వర్షం కారణంగా మోదీ ఇండోర్ హాల్లో యోగా చేయాల్సి వచ్చింది. అతి తక్కువ మందికి మాత్రమే.. ఈసారి మోదీతో కలిసి యోగా చేసే అవకాశం దక్కింది.
ప్రతియేటా జూన్ 21న వివిధ ప్రాంతాల్లో యోగా చేస్తూ వచ్చారు మోదీ. ఈసారి.. శ్రీనగర్ని ఎంచుకున్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ..
"యగా, సాధన భూమిగా పిలిచే శ్రీనగర్‌కి వచ్చే అవకాశం నాకు లభించింది. యోగా నుంచి వచ్చిన శక్తిని నేను ఫీల్ అవుతున్నాను. కశ్మీర్ నుంచి.. ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్న వారికి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాను," అని మోదీ అన్నారు.
PM Modi International Yoga Day 2024 : "యోగా చుట్టూ ఉన్న అభిప్రాయాలు.. గత 10ఏళ్లల్లో పూర్తిగా మారిపోయాయి. ఈరోజున ప్రపంచం సరికొత్త 'యోగా ఎకానమీ'ని చూస్తోంది. ఇండియాలో రిషికేశ్ నుంచి కాశీ, కేరళ వరకు..యోగా టూరిజంకు కనెక్షన్ కనిపిస్తోంది. యోగాని నేర్చుకునేందుకు ప్రపంచ దేశాల నుంచి ప్రజలు ఇండియాకు వస్తున్నారు. వ్యక్తిగత యోగా శిక్షకులను కూడా పెట్టుకుంటున్నారు. ఇదంతా.. యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించింది," అని మోదీ తెలిపారు.
"యోగా పట్ల ప్రజల ఆసక్తి కూడా పెరుగుతోంది. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ అంతర్జాతీయ నేతను కలిసినా.. యోగా గురించి నన్ను అడుగుతారు. యోగా అనేది రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. యోగాతో మంచి ఆరోగ్యం లభిస్తుంది. మనకి శక్తి లభిస్తుంది," అని మోదీ అన్నారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న యోగాను అలవాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మోదీ.
"ఫ్రాన్స్‌కి చెందిన 101ఏళ్ల మహిళా యోగా గురువుకు ఈసారి ఇండియా పద్మశ్రీ అవార్డు దక్కింది.ఆమె ఇండియాకు ఎప్పుడు రాలేదు. కానీ ఆమె జీవితాన్ని యోగాకు అంకితం ఇచ్చారు. యోగాపై అవగాహనను కల్పించేందుకు కృషి చేశారు. ఈ రోజున.. యోగాపై యూనివర్సిటీల్లో రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. రీసెర్చ్ పేపర్లు పబ్లీష్ అవుతున్నాయి," అని అన్నారు మోదీ.