International Yoga Day : వెన్ను నొప్పి తగ్గేందుకు రోజూ 10 నిమిషాలు ఈ యోగాసనాలు చేయండి
21 June 2024, 8:00 IST
- Yoga For Back Pain : నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. పని చేసే ఎవరైనా, ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని నిలబడి వెన్నునొప్పితో బాధపడవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెన్ను నొప్పి తగ్గించే యోగాసనాల గురించి తెలుసుకుందాం..
వెన్ను నొప్పి తగ్గించే యోగాసనాలు
మీరు కూడా రోజూ ఈ వెన్నునొప్పితో బాధపడుతున్నారా? ప్రతిరోజూ ఈ వెన్నునొప్పికి పెయిన్ రిలీవర్ స్ప్రే వాడుతున్నారా? అయితే అంత డబ్బు ఖర్చు చేసినా నొప్పి నుంచి ఉపశమనం పొందలేం. మన రోజూవారి జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకుంటే సరిపోతుంది. నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు.
వెన్నునొప్పి నుండి మంచి ఉపశమనం పొందాలనుకుంటే, యోగాభ్యాసం చేయండి. యోగా సాధన వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ యోగా దినోత్సవం సందర్భంగా వెన్నునొప్పిని వదిలించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని సులభమైన యోగాసనాలు ఇక్కడ ఉన్నాయి.
భుజంగాసనం
భుజంగాసనం చేయడానికి, ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. మీ పాదాలను వెనక్కు ఉంచాలి. తర్వాత రెండు అరచేతులను భుజం వైపు ఉంచాలి. తర్వాత చేతులను ఉంచి శ్వాస తీసుకుంటూ పైభాగాన్ని పైకి లేపి వెనక్కి వంచాలి. ఈ సందర్భంలో రెండు చేతులు మడత లేకుండా నేరుగా ఉండాలి. అదే సమయంలో ఉదరం కింది భాగం నేలకు తాకుతూ ఉండాలి. 10-15 సెకన్లు ఇలా ఉండాలి. తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా అసలు స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని 3-4 సార్లు చేయండి.
బాలాసనం
బాలాసనం చేయాలంటే ముందుగా మోకాళ్లపై కూర్చుని తర్వాత పిరుదులపై కూర్చోవాలి. అప్పుడు కాలి బొటనవేళ్లు ఒకదానిపై ఒకటి ఉండాలి. శ్వాస తీసుకున్న తర్వాత రెండు చేతులను నేరుగా పైకి లేపాలి. తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగి నుదిటితో నేలను తాకాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత మళ్లీ పాత స్థితికి రావాలి. సాధారణంగా శ్వాస తీసుకుంటూ కూడా ఈ ఆసనం వేయవచ్చు. ఈ ఆసనాన్ని ప్రతిరోజూ ఉదయం 4-5 సార్లు చేయవచ్చు.
మర్జారియాసనం
మర్జారియాసనం చేయాలంటే ముందుగా మోకాళ్ల మీద కూర్చోవాలి. మోకాళ్లు తుంటికి అనుగుణంగా, రెండు చేతులు భుజాలకు అనుగుణంగా ఉండాలి. పిల్లిలా చేతులు ముందుకు పెట్టాలి. కాళ్లు వెనక్కు ఉండాలి. తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ వీపును పైకి నెట్టాలి. తర్వాత తలను కిందకు దించాలి. కొన్ని సెకన్ల పాటు ఇలానే ఉండి, గాఢంగా ఊపిరి పీల్చుకోండి. తర్వాత శ్వాస వదులుతూ పొట్టను కిందికి నెట్టాలి. తల వెనుకకు వంచాలి. కొన్ని సెకన్ల పాటు ఇలాగే ఉండాలి. ఈ ఆసనాన్ని 5-6 సార్లు చేయండి.
టాపిక్