Pro Kabaddi League Promo: ప్రతి శ్వాసలో వీర కబడ్డీ.. ప్రొ కబడ్డీ లీగ్ కోసం తొడ కొట్టిన బాలయ్య .. స్పెషల్ ప్రోమో చూశారా?-pro kabaddi league promo balakrishna kichha sudeep join hands for kabaddi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pro Kabaddi League Promo: ప్రతి శ్వాసలో వీర కబడ్డీ.. ప్రొ కబడ్డీ లీగ్ కోసం తొడ కొట్టిన బాలయ్య .. స్పెషల్ ప్రోమో చూశారా?

Pro Kabaddi League Promo: ప్రతి శ్వాసలో వీర కబడ్డీ.. ప్రొ కబడ్డీ లీగ్ కోసం తొడ కొట్టిన బాలయ్య .. స్పెషల్ ప్రోమో చూశారా?

Hari Prasad S HT Telugu
Nov 21, 2023 05:54 PM IST

Pro Kabaddi League Promo: ప్రతి శ్వాసలో వీర కబడ్డీ అంటూ ప్రొ కబడ్డీ లీగ్ కోసం బాలకృష్ణ స్పెషల్ ప్రోమో చేశాడు. కబడ్డీ లీగ్ పదో సీజన్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతోంది.

ప్రొ కబడ్డీ లీగ్ ప్రోమోలో బాలకృష్ణ
ప్రొ కబడ్డీ లీగ్ ప్రోమోలో బాలకృష్ణ

Pro Kabaddi League Promo: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ వచ్చేస్తోంది. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి కోట్లాభిషేకం చేసిన ఈ లీగ్ ప్రమోషన్ కోసం ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగాడు. ఈ లీగ్ బ్రాడ్‌కాస్ట్ చేసే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ కబడ్డీ లీగ్ ప్రమోషన్ కోసం తెలుగు, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోలను బరిలోకి దించింది.

వీర కబడ్డీ ప్రతి శ్వాసలో అనే నినాదంతో ప్రొ కబడ్డీ లీగ్ తెలుగు ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ తీసుకొచ్చింది. ఇదే ప్రోమో అటు కన్నడ, హిందీల్లోనూ వచ్చింది. కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో టైగర్ ష్రాఫ్ ఇందులో కనిపించారు. ఈ ముగ్గురు స్టార్ హీరోలు చేసిన ప్రోమోను మంగళవారం (నవంబర్ 21) ఆ ఛానెల్ రిలీజ్ చేసింది.

ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. 9 సీజన్ల పాటు గ్రామీణ క్రీడ కబడ్డీని పట్టణాలకు కూడా చేరువ చేసిందీ లీగ్. అంతేకాదు వాళ్లకు ఎంతో మజా అందించింది. తాజాగా స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో కూడా అదే రేంజ్ లో ఉంది. ఓ పీరియడ్ డ్రామాగా ఈ ప్రోమోను రూపొందించడం విశేషం.

కబడ్డీ కోర్టును ఓ రణస్థలంగా చూపిస్తూ ఈ ముగ్గురు యోధులు యుద్ధం చేసినట్లుగా ప్రోమోలో చూపించారు. ఇక చివర్లో బాలయ్య బాబు తనదైన స్టైల్లో తొడ కొట్టాడు. తెలుగు ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. "గుండెల దమ్మే ఇంధనము.. మైదానమే రణస్థలము. వీర కబడ్డీ ప్రతి శ్వాసలో.. మరి పీకేఎల్ 10లో దుమ్ము రేపే దమ్మున్న యాక్షన్ చూసేందుకు మీరు రెడీనా" అంటూ ఈ బాలకృష్ణ ప్రోమో పోస్ట్ చేసింది.

డిసెంబర్ 2, రాత్రి 8 గంటల నుంచి ఈ ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ప్రారంభం కాబోతోంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ పీకేఎల్ చూడొచ్చు. ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుండటంపై బాలకృష్ణ స్పందించాడు. ప్రతి తెలుగువాడి శ్వాసలో కబడ్డీ ఉంది అంటూ అతడు అనడం విశేషం.

"ప్రతి భారతీయుడి మదిలో కబడ్డీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 సినిమాటిక్ ప్రయాణంలో భాగం కావడం ప్రత్యేకం. ప్రతి శ్వాసలో కబడ్డీ ఉండేలా అందరం కలిసి రండి. ప్రతి తెలుగు వాడిలో శ్వాసలో కబడ్డీ ఉంది" అని బాలయ్య బాబు అన్నాడు. ఈసారి పీకేఎల్ 10వ సీజన్ లో 12 ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి.

WhatsApp channel

టాపిక్