pro kabaddi league: ప్రొ కబడ్డీ లీగ్.. గ్రామీణ ఆటకు కోట్లాభిషేకం
pro kabaddi league.. మంచి యాక్షన్, డ్రామా, థ్రిల్‌తో రూరల్ ఇండియాలోనే కాదు.. అర్బన్ స్పోర్ట్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత అత్యధిక మంది చూసే లీగ్‌గా పీకేఎల్ ఎదిగింది. ఎనిమిదో సీజన్‌కు సిద్ధమవుతున్న ఈ పీకేఎల్.. ప్రతి సీజన్‌కూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ వెళ్తోంది.
ప్రొ కబడ్డీ లీగ్.. క్రికెట్ తప్ప వేరే ఆట తెలియదన్నట్లుగా వ్యవహరించే ఇండియాలాంటి దేశంలో సంచలనాలు సృష్టిస్తున్న లీగ్ ఇది. కబడ్డీలాంటి గ్రామీణ క్రీడకు కమర్షియల్ హంగులు అద్ది.. ఆ ప్లేయర్స్‌ను కూడా కోటీశ్వరులను చేస్తోంది. మంచి యాక్షన్, డ్రామా, థ్రిల్‌తో రూరల్ ఇండియాలోనే కాదు.. అర్బన్ స్పోర్ట్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత అత్యధిక మంది చూసే లీగ్‌గా పీకేఎల్ ఎదిగింది. ఏడు సీజన్లు పూర్తి చేసుకొని, ఎనిమిదో సీజన్‌కు సిద్ధమవుతున్న ఈ పీకేఎల్.. ప్రతి సీజన్‌కూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ వెళ్తోంది. పీకేఎల్ 8వ సీజన్‌లో మొత్తం 12 టీమ్స్, 135 మ్యాచ్‌లతో నెలల పాటు కబడ్డీ ప్రేమికులను ఉర్రూతలూగించనుంది.
ప్లేయర్స్‌పై కోట్ల వర్షం
2014లో తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ప్లేయర్స్ వేలం జరిగింది. అప్పటి వరకూ క్రికెట్‌లో ఐపీఎల్ ప్లేయర్స్ వేలం చూసిన అభిమానులను ఈ కబడ్డీ వేలం పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఐపీఎల్‌లో స్టార్ క్రికెటర్లను కోట్లు పెట్టి కొన్నాయి ఫ్రాంచైజీలు. అదే కబడ్డీ లీగ్ తొలి సీజన్‌లో ఓ ప్లేయర్ పలికిన అత్యధిక మొత్తం ఎంతో తెలుసా? కేవలం రూ. 12.8 లక్షలు. ఈ మొత్తమే అప్పట్లో కబడ్డీ ప్లేయర్స్‌కు చాలా ఎక్కువ. అప్పటి ఇండియన్ కబడ్డీ టీమ్ కెప్టెన్ రాకేశ్ కుమార్ ఈ ధర పలికాడు.
అదే ఇప్పుడు 8వ సీజన్ వచ్చేసరికి ఓ ప్లేయర్ అందుకోబోతున్న మొత్తం రూ. 1.65 కోట్లు అంటే నమ్మశక్యం కాదు. స్టార్ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ కబడ్డీ లీగ్ చరిత్రలో ఇంత భారీ ధర పలికిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక సిద్ధార్థ్ దేశాయ్‌లాంటి యువ ప్లేయర్‌కు రూ. 1.3 కోట్లు దక్కుతున్నాయి. ఈ ఏడేళ్లలో ప్రొ కబడ్డీ లీగ్ స్థాయి ఎంతలా పెరిగిపోయిందో చెప్పడానికి ఆటగాళ్ల వేలమే నిదర్శనం. ఓ కబడ్డీ ప్లేయర్ తన జీవితకాలం మొత్తం కూడా రూ. కోటి సంపాదించడం ఓ కలే. అలాంటిది ఒక్క సీజన్‌లోనే స్టార్ ప్లేయర్స్ ఈ మొత్తాన్ని తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఈ గ్రామీణ క్రీడలో ఉన్న మజాను ప్రొ కబడ్డీ లీగ్‌తో అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ చూసేవాళ్లలో 70 శాతం మంది పీకేఎల్ చూస్తుండటం ఈ లీగ్ సక్సెస్‌కు అద్దం పడుతోంది.
స్పాన్సర్‌షిప్, మీడియా హక్కులతోనూ కోట్లు
ఓ క్రికెట్ టోర్నీని స్పాన్సర్ చేయడానికి, లేదంటే ఆ మ్యాచ్‌ను లైవ్ చూపించడానికి కంపెనీలు పోటీ పడతాయి. వందల, వేల కోట్లతో టెండరు వేసి ఆ హక్కులను దక్కించుకుంటాయి. ఐదేళ్ల పాటు ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ చేయడానికి 2017లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఏకంగా రూ. 16 వేల కోట్లు చెల్లించింది. ఇంత మొత్తం కాకపోయినా.. కబడ్డీ లీగ్ ప్రత్యక్ష ప్రసార హక్కులను కూడా భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది స్టార్ ఇండియా.
ఒక్కో సీజన్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం స్టార్ ఇండియా రూ. 180 కోట్లు చెల్లించనుంది. అంటే ఐదేళ్ల పాటు లీగ్ మీడియా హక్కులను దక్కించకోవడానికి రూ. 900 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. ఏడో సీజన్‌కు ఇచ్చిన మొత్తం కంటే ఇది రెట్టింపు. ఇక పీకేఎల్ టైటిల్ స్పాన్సర్ వివో కూడా ఐదేళ్లకుగాను రూ. 300 కోట్లు చెల్లించడం చూస్తుంటే.. కబడ్డీ లీగ్‌కు ఎంతటి ప్రజాదరణ ఉందో అర్థమవుతుంది.
ఇదీ పీకేఎల్ సత్తా
పీకేఎల్ టైటిల్ స్పాన్సర్, మీడియా హక్కుల కోసం సంస్థలు వందల కోట్లు కురిపించడానికి బలమైన కారణం లేకపోలేదు. గత ఏడో సీజన్‌కు ఈ లీగ్ సాధించిన టీవీ, డిజిటల్ వ్యూయర్‌షిప్ మామూలుగా లేదు. రేటింగ్స్ సంస్థ బార్క్ ప్రకారం.. గత సీజన్‌లో పీకేఎల్‌కు మొత్తం 120 కోట్ల ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా లీగ్‌ను చూసిన వారి సంఖ్య 35.2 కోట్లు కావడం విశేషం.
వీళ్లంతా కలిసి 7,100 కోట్ల నిమిషాలు లీగ్‌పై గడిపారు. వ్యూయర్‌షిప్ పరంగా అంతకుముందు సీజన్ కంటే 9 శాతం వృద్ధి సాధించింది. పీకేఎల్‌తో ఇప్పటికే టాటా మోటార్స్, జిల్లెట్, థమ్సప్, బిస్లెరీ, ఏఎంఎఫ్‌ఐ, షేర్‌చాట్, టీవీఎస్‌లాంటి గ్లోబల్ బ్రాండ్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్రికెట్‌లాంటి థ్రిల్‌నే క్రీడాభిమానులు కబడ్డీ నుంచి కూడా పొందుతున్నారని పీకేఎల్ సక్సెస్‌ను చూస్తే స్పష్టమవుతోంది.
సంబంధిత కథనం