International Day of Yoga: రోజూ పావుగంటసేపు యోగా చేస్తే చాలు, ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు
21 June 2024, 7:00 IST
- International Day of Yoga: యోగా గొప్పతనం చెప్పేందుకే ప్రత్యేకంగా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకుంటాము. ఇది పదవ యోగా దినోత్సవం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం
International Day of Yoga: యోగా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దాని ప్రయోజనాలను గుర్తించడానికి ఐక్యరాజ్యసమితి 2014లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. యోగా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తుందని, దీనిపై అవగాహన పెంచేందుకే ఈ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన యోగా ప్రపంచ దేశాలకు పాకింది. గత పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానమంత్రి మోడీ 2015లో యోగాను ప్రచారం చేయడంలో కీలక వ్యక్తిగా మారారు. ఈసారి శ్రీనగర్ నుండి నరేంద్ర మోడీ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ ఏడాది థీమ్
మన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘యోగా ఫర్ సేల్ఫ్ అండ్ సొసైటీ’తో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మొదలుపెట్టబోతోంది. యోగా అనేది కేవలం ఒక వ్యక్తి కోసమే కాదు తనతో పాటు జీవిస్తున్న సమాజం కోసం అని కూడా చెప్పడమే ఈ సంవత్సరం థీమ్.
ఆధునిక తరానికి యోగా గొప్పతనాన్ని వివరించాలని ఆయుష్ ప్రయత్నిస్తోంది. యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి వల్ల ఎంతో మంది కష్టపడుతున్నారు. గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం, అధిక సమయం పాటూ కూర్చుని పని చేయడం వంటి వాటి వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయి. వాటికి చెక్ పెట్టే శక్తి యోగాకు ఉంది. యోగా అనేది శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది మానసిక, ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రశాంతతను అందిస్తుంది.
యోగాకు తినాల్సిన ఆహారం
ఆయుష్ యోగా చేసేవారికోసం కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం శరీరానికి, మనసుకు అనువైన ఆహారాన్ని తినాలని చెబుతోంది. శాకాహారం తినడమే యోగా సాధనకు మంచిదని వివరిస్తోంది. ముప్పై ఏళ్ల వయసు దాటిన వ్యక్తి లేదా అనారోగ్యం, అధిక శారీరక శ్రమ వంటివి పడుతున్న వ్యక్తులు తప్ప మిగతా వారంతా రోజుకు రెండు పూటలా తింటే సరిపోతుందని, అది కూడా శాకాహారం తింటే మంచిదని చెబుతోంది ఆయుష్.
యోగా వల్ల ఈ రోగాలన్నీ పరార్
ప్రతిరోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. వైద్య పరిశోధనలు కూడా యోగా అనేక రోగాలను దూరం పెడుతుందని చెబుతోంది. ప్రతిరోజూ యోగా పావుగంట నుంచి అరగంట చేస్తే చాలు శారీరక దృఢత్వంతో పాటు కార్డియోవాస్కులర్ అనారోగ్యాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు వంటివి నిర్వహించడంలో యోగా ఎంతో సాయపడుతుంది. జీవనశైలి సంబంధిత రుగ్మతలను తట్టుకోవడంలో యోగా ముందుంటుంది. ఎవరైతే డిప్రెషన్, మానసిక ఒత్తిడి, అలసట వంటి వాటితో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు యోగా చేయడం చాలా అవసరం. ఇక మహిళలు ప్రతిరోజు యోగా చేయడం వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి. యోగా అనేది ఆరోగ్యమైన శరీరాన్ని అందించడమే కాదు, మనసును స్థిరంగా ఉంచే ప్రక్రియ. ఇది సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఒక దారి చూపిస్తుంది.
యోగా చేసే ముందు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోండి. యోగాభ్యాసం ఖాళీ పొట్టతో చేయాలి. లేదా తేలికపాటి ఆహారాన్ని తిన్నాక చేయాలి. మరీ బలహీనంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో కాస్త తేనె వేసుకొని తాగి యోగా చేయవచ్చు. యోగాభ్యాసాన్ని చేసే ముందు మూత్రాశయం, ప్రేగులు ఖాళీగా ఉండాలి. అంటే ముందుగానే యూరిన్, లెట్రిన్ వంటి పనులు ముగించుకుంటే మంచిది. యోగా చేసేటప్పుడు తేలికైన సౌకర్యంతమైన కాటన్ ఇస్తులను ధరించి చేయడం మంచిది. ఎవరైతే తీవ్ర అలసటతో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో అలాంటివారు యోగా చేయకూడదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా యోగాభ్యాసాలను చేసేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గర్భం ధరించిన వారు, నెలసరిలో ఉన్నవారు కూడా యోగా చేసేముందు యోగా నిపుణులకు సంప్రదించి చేయడం ఉత్తమం.