తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cji Chandrachud: ‘గణపతి పూజ’ వివాదంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

CJI Chandrachud: ‘గణపతి పూజ’ వివాదంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

Sudarshan V HT Telugu

12 September 2024, 15:00 IST

google News
  • తన నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధాని మోదీని ఆహ్వానించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. సీజేఐ ఇంట్లో జరిగిన గణేషుడి పూజకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సీజేఐ, ఆయన సతీమణితో కలిసి హారతి ఇచ్చి వినాయకుడి విగ్రహానికి పూజలు చేశారు.

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేశుడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజలు
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేశుడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజలు (PTI)

సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేశుడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజలు

గణపతి పూజ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడంపై శివసేన (యూబీటీ) నేతలు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు విమర్శలు గుప్పించారు. ఇది న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంపై, పారదర్శకతపై అనుమానాలు రేకెత్తిస్తుందని విమర్శించారు.

సంప్రదాయ మహారాష్ట్ర టోపీతో..

సంప్రదాయ మహారాష్ట్ర టోపీని ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఆయన సతీమణితో కలిసి ఢిల్లీలోని వారి నివాసంలో సమావేశమయ్యారు. వినాయకుడి విగ్రహం ముందు హారతి ఇచ్చి పూజలు చేశారు. గణపతి పూజ కోసం తన ఇంటికి ప్రధానిని సీజేఐ ఆహ్వానించడంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తులు, రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి సంబంధాలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసును సీజేఐ విచారిస్తున్న సమయంలో ఇలా సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం అనుమానాలను రేకెత్తిస్తుందని అన్నారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు.

మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసు

‘‘ప్రధాన న్యాయమూర్తి నివాసానికి ప్రధాని వెళ్లారు. అక్కడ సీజేఐ, ఆయన భార్యతో కలిసి గణేశుడికి హారతి ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షకులు ఈ విధంగా రాజకీయ నాయకులను కలవడం అనుమానాలకు తావిస్తోందనేది మా ఆందోళన. ప్రస్తుత ప్రభుత్వంతో సంబంధం ఉన్న మహారాష్ట్రలో మా కేసు ప్రధాన న్యాయమూర్తి ముందు విచారణ జరుగుతోంది. ప్రధానమంత్రి ఇందులో భాగం. మాకు న్యాయం జరుగుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నాం. చీఫ్ జస్టిస్ ఈ కేసు నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలించాలి’’ అని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. గణపతి ఉత్సవ్ సందర్భంగా ప్రజలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని, అయితే ప్రధాని ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లకు వెళ్లారో తనకు సమాచారం లేదని ఆయన అన్నారు. తమ మహారాష్ట్ర సదన్ తో సహా ఢిల్లీలో అనేక వేడుకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విచారణను ముగించడంపై చీఫ్ జస్టిస్ దృష్టి పెడతారని ఆశిస్తున్నానని రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు

ప్రధాని మోదీని తన నివాసానికి ఆహ్వానించడం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై, పౌరుల హక్కులను పరిరక్షించడంపై, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడంపై సుప్రీంకోర్టు పాత్ర పై అనుమానాలు రేకెత్తేలా సందేశాన్ని పంపుతుందని సుప్రీంకోర్టు (supreme court) సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ప్రధాని మోదీని సీజేఐ చంద్రచూడ్ తన నివాసానికి ఆహ్వానించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ‘‘కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఉన్న న్యాయవ్యవస్థకు ఇది చాలా చెడు సంకేతాన్ని పంపుతుంది. అందుకే కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన జరగాలి’’ అని ప్రశాంత్ భూషణ్ ఎక్స్ లో రాశారు.

తదుపరి వ్యాసం