Ashok Gehlot: న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు; ముఖ్యమంత్రికి నోటీసులు
Ashok Gehlot: న్యాయవ్యవస్థ లో పెద్ద ఎత్తున అవినీతి నెలకొందని అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు రాజస్తాన్ హైకోర్టు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.
Ashok Gehlot: రాజస్తాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ శనివారం రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై నెలకొన్న అవినీతిపై అశోక్ గహ్లోత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కరణగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించాలని రాజస్తాన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన రాజస్తాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ శనివారం రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులపై 3 వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. స్థానిక న్యాయవాది శివ చరణ్ గుప్తా ఈ పిల్ వేశారు.
న్యాయ వ్యవస్థలో..
బుధవారం ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో దారుణమైన అవినీతి నెలకొని ఉన్నదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొందరు న్యాయవాదులు తాము వాదిస్తున్న కేసుల్లో తీర్పును తామే రాసి, అదే తీర్పును జడ్జీల ద్వారా వినిపిస్తున్నారని నాకు తెలిసింది’’ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, రాజకీయ దుమారం చెలరేగడంతో.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అవి తన అభిప్రాయాలు కావని అశోక్ గహ్లోత్ వివరణ ఇచ్చారు. న్యాయవ్యవస్థపై తనకు అపార గౌరవం, విశ్వాసం ఉందన్నారు. కాగా, అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలకు నిరసనగా రాజస్తాన్ లో పెద్ద ఎత్తున న్యాయవాదులు ధర్నాలు నిర్వహించారు.