Supreme Court : మీరు గొంతు తగ్గించి మాట్లాడండి.. కోల్‌కతా రేప్ కేసు విచారణలో న్యాయవాదికి సీజేఐ హెచ్చరిక
Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ సందర్భంగా స్వరం తగ్గించి మాట్లాడాలని ఒక న్యాయవాదిని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ హెచ్చరించారు. నిరసనలు చేస్తున్న వైద్య సిబ్బంది విధుల్లోకి వెళ్లాలని సూచించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు విచారణ సందర్భంగా తక్కువ స్వరంతో మాట్లాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఒక న్యాయవాదిని హెచ్చరించారు. సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం సోమవారం కోల్‌కతా హత్యాచార ఘటనపై విచారణ జరిపింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ సందర్భంగా వాదించారు. నేరానికి సంబంధించిన నిరసనల్లో రాళ్లు రువ్విన వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. సిబల్ వంటి సీనియర్ న్యాయవాది కోర్టులో ఎలా ఈ ఆరోపణ చేస్తారని బీజేపీకి అనుబంధంగా ఉన్న న్యాయవాది కౌస్తవ్ బాగ్చీ ప్రశ్నించారు.
దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ స్పందించారు. 'మీరు కోర్టు వెలుపల గ్యాలరీని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నిస్తున్నారా? గత రెండు గంటలుగా మీ తీరు గమనిస్తున్నాను. మీరు ముందుగా మీ పిచ్‌ని తగ్గించగలరా? ప్రధాన న్యాయమూర్తి మాట వినండి, మీ పిచ్‌ని తగ్గించండి. మీరు మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ కార్యక్రమాలను చూస్తున్న ప్రేక్షకులను ఉద్దేశించి కాదు.' అని సీజేఐ అన్నారు.
ఈ మేరకు విచారణ సందర్భంగా లాయర్ గొంతు తగ్గించాలని సీజేఐ చంద్రచూడ్ హెచ్చరించారని ఎన్‌డీటీవీ పేర్కొంది. తర్వాత న్యాయవాది బాగ్చీ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు లాయర్లు ఏకకాలంలో వాదించడం అలవాటు లేదన్నారు. 'ఒకే సమయంలో 7-8 మంది వాదించుకునే ఈ రకమైన న్యాయవాదం నాకు అలవాటు లేదు.' అని సీజేఐ అన్నారు.
సోమవారం నాటి విచారణ సందర్భంగా వైద్యురాలిపై అత్యాచారం, హత్య తర్వాత కొనసాగుతున్న వైద్యుల నిరసనపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడారు. వృత్తిపరమైన విధులకు ఆటంకం కలిగించేలా నిరసనలను అనుమతించబోమని అన్నారు. నిరసన తెలిపిన వైద్యులు విధుల్లో చేరకపోతే, వారిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా అడ్డుకోలేమని పేర్కొంది.
కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఆగస్టు 9న జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది.