Kolkata doctor rape case : కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Kolkata doctor rape case Supreme Court : కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త స్టేటస్ రిపోర్ట్‌ని సమర్పించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలిచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసు విషయంలో వచ్చే మంగళవారం నాటికి కొత్త స్టేటస్ రిపోర్ట్‌ని సమర్పించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఘటనాస్థలంలో సేకరించిన సాంపిల్స్పై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది.
ఆగస్ట్ 9న దారుణంగా రేప్, హత్యకు గురైన కోల్‌కతా వైద్యురాలి కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, సోమవారం ఉదయం మరోమారు విచారించింది. ఇందులో భాగంగా సీబీఐ తరఫు హాజరైన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా కోర్టుకు పలు కీలక విషయాలను వెల్లడించారు.
"మా దగ్గర ఫోరెన్సీక్ పరీక్ష రిపోర్టు ఉంది. నాటి రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కోల్‌కతా వైద్యురాలి జీన్స్, లోదుస్తులు తొలగించి, సెమీ న్యూడ్‌గా ఉన్నట్టు, శరీరంపై గాయాలైనట్టు, ఆ సమయంలో సాంపిల్స్ తీసుకున్నట్టు రిపోర్టులో ఉంది. అయితే సాంపిల్స్‌ని పశ్చిమ్ బెంగాల్‌లోని సీఎఫ్ఎస్ఎల్కి పంపించారు. కానీ వాటిని ఎయిమ్స్‌కి తీసుకెళ్లాలని సీబీఐ నిర్ణయించింది," అని తుషార్ మెహ్తా తెలిపారు.
మరోవైపు కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఆగస్టులో వైద్యురాలిపై అత్యాచారం, హత్య తర్వాత డాక్టర్ల సమ్మె ఫలితంగా 23 మంది మరణించారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత పశ్చిమ్ బెంగాల్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కపిల్ సిబల్ మాట్లాడుతూ దర్యాప్తు స్టేటస్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిందని చెప్పారు. అయితే తనకు ఎలాంటి నివేదిక అందలేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సీల్డ్ కవర్లో సమర్పించిన నివేదికను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో భద్రతకు బాధ్యత వహించే సీఐఎస్ఎఫ్కి లాజిస్టిక్ సపోర్ట్ అందించడంలో పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం సుప్రీంకోర్టును తెలిపింది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం సహకారం లేకపోవడం లోతైన సమస్యను సూచిస్తోందని, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)కు పూర్తి మద్దతు ఇచ్చేలా రాష్ట్ర అధికారులను ఆదేశించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన దరఖాస్తులో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
మరోవైపు నిరసనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో తిరిగి చేరాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల కల్లా విధుల్లో చేరితే ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొంది.
ఆగస్ట్ 9 ఈ ఘటన జరగ్గా.. కొన్ని రోజుల తర్వాత, సున్నితమైన ఈ కేసును కలకత్తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది. సీబీఐ దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఈ కేసులో సంజయ్ రాయ్‌ని మాత్రమే అరెస్ట్ చసింది. మరోవైపు కోల్‌కతా వైద్యురాలి హత్య సమయంలో సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్ రాయ్ మాత్రమే నేరానికి పాల్పడినట్టు పేర్కొన్నాయి.
సంబంధిత కథనం