Sandip Ghosh Arrest : కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్
Sandip Ghosh Arrest : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను హత్యాచారం కేసులో సీబీఐ విచారణ చేసింది. అయితే కాలేజీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలపై సందీప్ ఘోష్ అరెస్టు అయ్యారు.
కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం అరెస్టు చేసింది. ఘోష్ హయాంలో ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్‌లో ఘోష్ పేరును చేర్చిన కొద్ది రోజులకే ఈ అరెస్టు జరగడం గమనార్హం.
ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీపై అత్యాచారం, హత్య కేసులో ఘోష్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత అతడికి సంబంధించి ఆర్థిక అవకతవకలపై విషయాలు బయటకు వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైన ఎఫ్ఐఆర్‌లో సందీప్ ఘోష్‌తోపాటు మూడు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. దీంతో సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఉన్న నిజాం ప్యాలెస్ కార్యాలయానికి అతడిని తరలించారు. అక్కడ ఆర్థిక అవకతవకలపై విచారణ జరిగింది.
ఆర్‌జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్‌గా చేసిన సందీప్ ఘోష్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని మృతదేహాలను విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాలు అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకోవడంలాంటి అనేక ఆరోపణలు అతడిపై ఉండటంతో హైకోర్టు విచారణ చేయాలని ఆదేశించింది.
అవినీతి కేసులకు సంబంధించి కోల్‌కతాలోని ఘోష్ నివాసంలో ఆగస్టు 25న సీబీఐ ఒకరోజు సోదాలు నిర్వహించారు. మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మాజీ ప్రిన్సిపాల్, మరికొందరి హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇటీవల సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. తాజాగా ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు అయ్యారు.
ఆగస్టు 9 తెల్లవారుజామున కోల్‌కతా ఆర్‌జీ కర్ ప్రభుత్వాసుపత్రిలోని సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటికే అతడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోల్‌కతా హత్యాచారం కేసుకు సంబంధించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ముసాయిదా బిల్లులో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు మరణశిక్ష విధించాలని ప్రతిపాదించింది. అత్యాచారం, గ్యాంగ్ రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి జీవితాంతం జీవిత ఖైదు పడుతుందని ముసాయిదాలో పేర్కొన్నారు.