Kolkata Doctor Rape Case: 'పోలీసులు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు' కోల్‌కతా డాక్టర్ తల్లిదండ్రుల ఆరోపణ
Kolkata Doctor rape case: పోలీసులు తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించడం సంచలనం రేపింది. కోల్‌కతా లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద బుధవారం రాత్రి జూనియర్ డాక్టర్లు నిర్వహించిన నిరసనలో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో గత నెలలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు పోలీసులు తమ పట్ల వ్యవహరించిన తీరును వెల్లడించారు. తమ కుమార్తె మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం ద్వారా కేసును అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. కోల్‌కతా పోలీసులు తమకు డబ్బులిచ్చేందుకు ప్రయత్నించారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.
పోలీసులు మొదటి నుంచి కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదని, పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాన్ని తీసుకెళ్లే సమయంలో పోలీస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. ‘ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగించారు. సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బు ఆఫర్ చేశారు. మేం వెంటనే తిరస్కరించాం" అని బాధితురాలి తండ్రిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
తమ కుమార్తెకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం రాత్రి జూనియర్ డాక్టర్లతో కలిసి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద నిరసనలో పాల్గొన్నారు.
ఆగస్టు 9న 31 ఏళ్ల ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహం ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే వీడియో ఫుటేజ్ లభ్యమైంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నేరం జరిగిన సమయంలో భవనంలోకి ప్రవేశించడం సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కనిపించడంతో కోల్ కతా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
వైద్యురాలిని తీవ్రంగా గాయపరిచి, లైంగిక దాడి చేసిన తర్వాత సంజయ్ రాయ్ బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత కలకత్తా హైకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
కోల్‌కతా రేప్-మర్డర్ కేసుపై నిరసనలు
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే బాధితురాలికి న్యాయం చేయాలంటూ డాక్టర్లతో సహా ప్రజలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
కోల్‌కతాలోని జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందం మంగళవారం నగర పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌కు చేతితో తయారు చేసిన కృత్రిమ వెన్నెముకను అందజేసి, ఈ కేసులో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు "వెన్నెముకను పెంచాలి" అని కోరుతున్నట్టు తెలిపారు.
కాగా పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె బుధవారం కూడా కొనసాగింది. చాలా కేంద్రాల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి.
బాధితులకు న్యాయం చేయాలంటూ 'రీక్లేమ్ ది నైట్' క్యాంపెయిన్’లో భాగంగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు బుధవారం అర్ధరాత్రి ర్యాలీ నిర్వహించారు. రాత్రి 9 గంటల సమయంలో కోల్‌కతాలో ఒక ప్రత్యేకమైన, ఉద్వేగభరితమైన పౌర సంఘీభావ చర్య కనిపించింది, నివాసితులు ఒక గంట పాటు తమ లైట్లను ఆపివేసి, చేతిలో కొవ్వొత్తులతో వీధుల్లోకి దిగారు.
(పీటీఐ సమాచారంతో)
టాపిక్