No jobs to IITans: ఈ ఏడాది ఐఐటీ స్టుడెంట్స్ కు కూడా ప్లేస్ మెంట్స్ లేవు.. వేలాది ఐఐటీ విద్యార్థుల ఎదురుచూపులు
23 May 2024, 15:58 IST
IIT news: ఒకవైపు పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. మరోవైపు, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు సైతం ప్లేస్ మెంట్స్ దొరకని పరిస్థితి నెలకొన్నది. దాంతో ఆయా ఐఐటీలు స్టార్టప్ ల వైపు చూస్తున్నాయి.
ఐఐటీల్లో కూడా ప్లేస్ మెంట్స్ సంక్షోభం
No jobs to IIT students: మరికొద్ది రోజుల్లో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ కోర్స్ ముగుస్తోంది. ఈ తరుణంలో, సాధారణంగా ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్లేస్ మెంట్స్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ సంవత్సరం చిన్న, చితకా కాలేజీల్లోనే కాదు.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో కూడా ప్లేస్మెంట్ ఆందోళనలు వెంటాడుతున్నాయి. పలు ఐఐటీల్లో రెండవ నియామక రౌండ్లో కూడా వందలాది మంది విద్యార్థులకు ఇంకా ఉద్యోగం లభించలేదు.
పూర్వ విద్యార్థుల వైపు చూపు..
తమ విద్యాసంస్థల్లో ప్లేస్మెంట్స్ సంక్షోభం నెలకొనడంతో ఆయా ఐఐటీలు కొత్త విభాగాలకు చెందిన స్టార్టప్ లు, పూర్వ విద్యార్థులు, రిక్రూటర్లను, గతంలో తమ క్యాంపస్ ల నుంచి నియమించుకున్న కంపెనీలను ప్లేస్ మెంట్ టీమ్ సభ్యులు సంప్రదిస్తున్నారు. డిపార్ట్ మెంట్లు, ప్రొఫెసర్లు కూడా విద్యార్థులను రంగంలోకి దింపి సహాయం చేయాలని కోరుతున్నారు.
ఐఐటీ బాంబేలో కూడా..
ఐఐటీ బాంబేలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన 300 నుంచి 400 మంది విద్యార్థులకు ఇంకా ప్లేస్ మెంట్స్ లభించలేదు. ప్లేస్ మెంట్స్ కోసం 1,973 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,187 మందికి ఫేజ్-1 ప్రక్రియలో చోటు కల్పించారు. మరో 200 మందిని ఇప్పటికే ఫేజ్-2లో ఉంచామని, చివరి కౌంట్ నుంచి ఈ సంఖ్య పెరిగింది. ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-ఖరగ్పూర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-కాన్పూర్లలో ప్లేస్మెంట్లు (placements) డిసెంబర్లో ప్రారంభమవుతాయి. కొన్ని నెలల వ్యవధిలో రెండు దశల్లో ప్లేస్ మెంట్లు నిర్వహిస్తారు.
వేతనాల విషయంలో కూడా నిరాశే..
తమ కళాశాలలో ప్రతి స్ట్రీమ్ నుంచి కొంతమంది విద్యార్థులకు ఇంకా ప్లేస్మెంట్స్ లభించలేదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు తెలిపారు. తనకు మొదటి దశలో ప్లేస్మెంట్ లభించినట్లు చెప్పాడు. కాలేజీల్లోని ప్లేస్మెంట్ టీమ్ పలుమార్లు పూర్వ విద్యార్థులను సంప్రదిస్తోందని తెలిపారు. చాలా మంది సొంతంగా కూడా ప్రయత్నిస్తున్నారని ఆ విద్యార్థి తెలిపాడు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు కూడా వేతనాలు ఆశించినంతగా లేవన్నాడు. ‘‘ప్యాకేజీల్లో స్వల్ప తగ్గుదల ఉంది. గత ఏడాది సగటు ప్యాకేజీ రూ.26 లక్షలుగా ఉంది. ఈసారి అది రూ.25 లక్షలకు తగ్గింది' అని ప్లేస్మెంట్ టీమ్ సభ్యుడు తెలిపారు. ఈ ఏడాది కూడా హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సంస్థల నుంచి కోటికి పైగా ప్యాకేజీలు వచ్చినప్పటికీ, ఈ సంఖ్య నామమాత్రంగానే ఉంది’’ ఐఐటీ కాన్పూర్ ప్లేస్ మెంట్ టీమ్ సభ్యుడు ఒకరు చెప్పారు.
నియామకాల్లో మందగమనం
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించడానికి, కొత్తగా రిక్రూట్మెంట్స్ ను నిర్వహించకపోవడానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘‘కొరోనా సమయంలో ఏడాదిన్నరపాటు అవసరానికి మించి నియామకాలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగుతోంది. స్టార్టప్ లకు నిధులు ఎండిపోతున్నాయి. సప్లై చెయిన్ లో అంతరాయాలు నెలకొన్నాయి. దాంతో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి’’ అని వారు వివరించారు. 2021, 2022లో బూమ్ సమయంలో అధికంగా నియామకాలు చేపట్టిన కంపెనీలు సిబ్బందిని తగ్గించడం ప్రారంభించాయి. ఈ ప్రభావం బీ-స్కూల్, ఇంజనీరింగ్ క్యాంపస్ లలోని కళాశాలలపై పడింది.
పెద్ద కంపెనీలు వెనక్కి తగ్గాయి
కొన్ని కంపెనీలు కొత్త ప్రొఫైల్స్ తో తిరిగి వస్తున్నాయని ఒక ఐఐటీ లోని ప్లేస్మెంట్ టీమ్ సభ్యుడు ఒకరు తెలిపారు. జూలైలో కొత్త సెషన్ ప్రారంభమవుతుందన్నారు. కంపెనీల నుంచి వచ్చిన ప్రతి కాల్ ను పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా విద్యార్థులను గైడ్ చేస్తున్నామని చెప్పారు. ఐటీ సేవలకు సంబంధించిన చాలా పెద్ద కంపెనీలు కూడా ఈ ఏడాది క్యాంపస్ ల నుంచి నియామకాలు చేపట్టకూడదని నిర్ణయించాయి. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకాలు 2023లో 49 శాతం నుంచి 2024 హెచ్1లో 42 శాతానికి తగ్గాయని టీమ్ లీజ్ డిజిటల్ ఫిబ్రవరిలో విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. దేశంలోని టాప్ టెక్ రిక్రూటర్లు కొత్త నియామకాలపై వెనక్కి తగ్గడంతో భారతదేశంలో కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన టెక్ టాలెంట్ తో పాటు మిడ్-కెరీర్ ఉద్యోగులకు తక్షణ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని మింట్ జనవరిలోనే నివేదించింది. దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ సేవల కంపెనీలు చివరిసారిగా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కు దూరంగా ఉన్నాయి.
ఉన్నత విద్య వైపు..
ఈసారి ఆర్థిక మాంద్యం కారణంగా పరిశ్రమ మందగమనాన్ని విద్యార్థులు ఊహించడంతో ప్లేస్ మెంట్లకు బదులుగా ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా 200 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తే, ఈ ఏడాది 300 మంది విద్యార్థులు ఆ పని చేస్తున్నారని ఐఐటీ కాన్పూర్ ప్లేస్ మెంట్ టీమ్ సభ్యుడు ఒకరు తెలిపారు. తమ కళాశాలలో సుమారు 2000 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంకా 100-150 మందికి ఉద్యోగం దొరకలేదని సభ్యులు వివరించారు.