QS rankings 2024: ప్రఖ్యాత క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబే కు స్థానం-qs rankings 2024 iit bombay among top 150 universities globally best in country ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Qs Rankings 2024: ప్రఖ్యాత క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబే కు స్థానం

QS rankings 2024: ప్రఖ్యాత క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబే కు స్థానం

HT Telugu Desk HT Telugu
Jun 28, 2023 11:15 AM IST

QS rankings 2024: ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ ర్యాంకింగ్స్ (QS rankings 2024) లో ఐఐటీ బాంబే స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 150 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

QS rankings 2024: ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ ర్యాంకింగ్స్ (QS rankings 2024) లో ఐఐటీ బాంబే స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 150 విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

IIT Bombay in top 150: టాప్ 150లో ఒకటి..

భారత్ లో అత్యున్నత విద్యాసంస్థలుగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology IIT) లను పరిగణిస్తారు. వాటిలో కూడా ఐఐటీ బాంబే (IIT-B) కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థల ర్యాంకింగ్స్ ను ఏటా ప్రకటించే క్వాకరెల్లి సిమండ్స్ (Quacquarelli Symonds QS) సంస్థ జాబితాలో కూడా ఐఐటీ బాంబే స్థానం సంపాదించింది. క్యూఎస్ ర్యాంకింగ్స్ ను అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబే టాప్ 150లో ఒకటిగా 149వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఐఐటీ బాంబే ర్యాంక్ 172. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఈ సంవత్సరం టాప్ 200 లో నిలిచిన మరో విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీ. ఈ సంస్థ ర్యాంక్ 192. అత్యున్నత విద్యా ప్రమాణాలు, ఉద్యోగ కల్పన, అంతర్జాతీయ పరిశోధనల్లో భాగస్వామ్యం, ఫాకల్టీ - స్టుడెంట్ రేషియో.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను రూపొందిస్తారు.

IISc rank: తగ్గిన ఐఐఎస్సీ ర్యాంక్

‘‘భారత్ లో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత విద్యాసంస్థగా ఐఐటీ బాంబే ఉంది. గత ఐదేళ్లలో ఈ విద్యా సంస్థ ఎంప్లాయర్ రెప్యుటేషన్ ర్యాంకింగ్ 102 నుంచి 69 కి పెరిగింది. అంతర్జాతీయంగా ప్రముఖ విద్యా సంస్థలతో పోటీ పడడానికి ఐఐటీ బాంబే మరింత కృషి చేయాల్సి ఉంది’’ అని క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకటన పేర్కొంది. 2018 నుంచి 2022 మధ్య ఐఐటీ బాంబే లో పరిశోధనల్లో ప్రగతి 17% పెరిగిందని వెల్లడించింది. ఈ క్యూఎస్ రేటింగ్స్ లో భారత్ నుంచి 45 విశ్వ విద్యాలయాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటిలో నాలుగు కొత్త వర్సిటీలు కూడా ఉన్నాయి. అవి యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. భారత్ లోని వర్సిటీల్లో 13 గత సంవత్సరం ర్యాంక్ కన్నా దిగజారాయి. వాటిలో బెంగళూరులోని ఐఐఎస్సీ (Indian Institute of Sciences IISc) ఒకటి. ఈ విద్యా సంస్థ గత సంవత్సర ర్యాంక్ 155 కాగా, ఈ ఏడు అది 225 కి చేరింది. అలాగే, ఐఐటీ మద్రాస్ ర్యాంక్ 250 నుంచి 285 కి, ఐఐటీ ఢిల్లీ ర్యాంక్ 174 నుంచి 192 కి మారాయి.

Whats_app_banner