Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!
Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు పేరిట నిరుద్యోగులను మోసం చేసి కంబోడియాకు తీసుకెళ్లి చైనా కంపెనీలకు అమ్మేస్తున్నారు. చైనా కంపెనీలు వీరితో సైబర్ నేరాలు చేయిస్తున్నాయి.
Visakha Human Trafficking : ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసి కంబోడియాకు తీసుకెళ్లి, చీకటి గదుల్లో బంధించి చిత్ర హింసలకు గురిచేసిన ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసి విదేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంచి సంపాదనతో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిరుద్యోగ యువకులను కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ లోని చైనా కంపెనీలకు పంపిస్తున్నారు ఏజెంట్లు.
అసలేం జరిగింది?
విశాఖ జిల్లా గాజువాకకు చెందిన చుక్కా రాజేష్ ఇంజినీరింగ్ చదివాడు. గతంలో రాజేష్ గల్ఫ్‌లో ఫైర్ సేఫ్టీ మేనేజర్‌గా పనిచేశాడు. 2021లో వివాహం అనంతరం గల్ఫ్ వెళ్లడం మానేశాడు. అయితే గల్ఫ్ దేశాలలోని కంపెనీలలో పనిచేసేందుకు యువకులను పంపడం మొదలుపెట్టాడు. 2023 మార్చి నెలలో కంబోడియా నుంచి సంతోష్ అనే యువకుడు రాజేష్‌ను సంప్రదించాడు. కంబోడియాలో సిస్టమ్ ఆపరేటర్లుగా పని చేయడానికి కంప్యూటర్ తెలిసిన 30 మంది యువకులను పంపాలని కోరారు. ట్రావెల్ కు సంబంధించిన అన్ని విషయాలు తానే చూసుకుంటానని సంతోష్ రాజేష్‌కు హామీ ఇచ్చాడు. ప్రతి యువకుడి వద్ద రూ.90 వేలు తీసుకుని, రూ.70 వేలు తనకు ఇచ్చి మిగిలిన రూ.20 వేలు రాజేష్ ను కమీషన్ గా తీసుకోవాలని సంతోష్ నమ్మించాడు.
చైనా కంపెనీలకు విక్రయం
నిందితుడు సంతోష్ ఇలా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సేకరించి కంపెనీలకు బదిలీ చేయడం, టాస్క్ గేమ్‌లు, క్రిప్టోకరెన్సీ వంటి మోసాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను మభ్యపెట్టడంతో ఇతర సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. సంతోష్ మాటలు నమ్మిన రాజేష్ గతేడాది మార్చిలో మూడు బ్యాచ్‌లలో 27 మంది యువకులను కంబోడియాకు పంపాడు. రాజేష్ దాదాపు 150 మంది యువకులను కంబోడియా, బ్యాంకాక్‌కు పంపాడు. వీరిలో కొంతమందిని టూరిస్ట్ వీసాలపై బ్యాంకాక్‌కు తీసుకెళ్లారు ఏజెంట్లు. బ్యాంకాక్ నుంచి వారిని కంబోడియాకు అక్రమంగా తరలించారు. అక్కడ యువకుల నైపుణ్యాలను బట్టి చైనా కంపెనీలకు 2,500 నుంచి 4,000 డాలర్లకు విక్రయించారు. ఈ కంపెనీలు యువకులను చీకటి గదుల్లోకి బంధించి తాము చెప్పినట్లు చేయాలని వేధించారు. వీరికి వివిధ సైబర్ నేరాలలో శిక్షణ ఇచ్చారు. ఇలా చేయమన్న వారిని హింసించారు.
ముగ్గురి అరెస్ట్
ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, అనంతపురం, పలాస, తుని, అనకాపల్లి, తెలంగాణ, కోల్‌కతాకు చెందిన బాధితులను బెదిరించి వారితో సైబర్ నేరాలు చేయించారు. ఈ నేరాల్లో వారు సంపాదించిన డబ్బులో ఒక శాతం మాత్రమే వారికి ఇచ్చారు. మిగిలినది కంపెనీలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేవి. ఈ డబ్బును కంపెనీల నిర్వాహకులు క్యాసినో, మద్యం, వ్యభిచారంపై ఖర్చు చేసేవారు. అయితే ఈ కంపెనీ నుంచి తప్పించుకున్న బాధితుడు బొత్స శంకర్ విశాఖ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తీగ లాగితే డొంక కంబోడియాలో కదిలింది. ఈ కేసులో ఏజెంట్లు చుక్కా రాజేష్ తో పాటు కొండలరావు, జ్ఞానేశ్వర్ రావులను అరెస్టు చేసినట్లు వైజాగ్ సిటీ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఎవరైనా ఉంటే ఈ నెంబర్ 9490617917 ను సంప్రదించాలని సీపీ తెలిపారు.