China లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఏఐ తో చైనా కుట్ర
భారత్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తీరును ప్రభావితం చేయడానికి కృత్రిమ మేథ సహాయంతో చైనా కుట్ర చేస్తోందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సృష్టించిన కంటెంట్ ను సోషల్ మీడియా లో వ్యాప్తి చేస్తోందని వెల్లడించింది.
కృత్రిమ మేధ (AI) ద్వారా సృష్టించిన అవాస్తవ కంటెంట్ ను సోషల్ మీడియాలో వ్యాపింపజేసి, భారత్ లో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా ప్రయత్నించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలలో జరగనున్న ఎన్నికలు కూడా ఇలాంటి కంటెంట్ వల్ల ప్రభావితమవుతాయని మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది.
మీమ్స్, రీల్స్, వీడియోలు, ఆడియోలతో..
మీమ్స్, వీడియోలు, ఆడియోల ఏఐ జనరేటెడ్ కంటెంట్ ను సోషల్ మీడియా (social media) ద్వారా వ్యాప్తి చేసి, తమకు అనుకూలంగా ఫలితాలు రావడానికి చైనా ప్రయత్నించే అవకాశముందని మైక్రోసాఫ్ట్ నివేదిక తెలిపింది. 2023 జూన్ నుంచి చైనా, ఉత్తర కొరియాల నుంచి అనేక ముఖ్యమైన సైబర్ సంబంధిత అనుమానిత ధోరణులను గమనించామని ఆ నివేదిక తెలిపింది. దక్షిణ పసిఫిక్ దీవుల్లోని దేశాలు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని ప్రాంతీయ ప్రత్యర్థులు, యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ లక్ష్యంగా చైనా (CHINA) ఈ సైబర్ కుట్రలు చేస్తోందని వెల్లడించింది. ఫ్లాక్స్ టైఫూన్ అనే చైనీస్ సైబర్ యాక్టర్ అమెరికా-ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలకు సంబంధించిన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఫిలిప్పీన్స్, హాంకాంగ్, భారత్, అమెరికాల్లో కూడా పలు సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.