China to bring in ‘emergency’ level censorship: దేశంలో కరోనాను అంతమొందించడానికి చైనా చేపట్టిన జీరో కోవిడ్ పాలసీ’పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ పాలసీలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సహా పలు కఠిన ఆంక్షలపై చైనీయులు మండి పడ్తున్నారు.
జీరో కోవిడ్ పాలసీపై నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో.. చైనా ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్లో కొన్నింటిపై సడలింపునిచ్చింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించడానికి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఇక అవసరం లేదని సడలింపునిచ్చింది. అయితే, ఆ సడలింపులు ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం లేదు. బీజింగ్, షాంఘై తదితర నగరాల్లో ప్రజలు బ్లాంక్ వైట్ పేపర్ చూపుతూ, నోటికి నల్ల గుడ్డ కట్టుకుని, మౌన ప్రదర్శనలతో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విధించిన ఆంక్షల కారణంగా . ఉపాధి అవకాశాలను కోల్పోయి, ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో, చైనా అధ్యక్షుడు, దేశంలో అత్యంత శక్తిమంతుడైన జీ జిన్ పింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు పెరుగుతున్నాయి.
చైానాలో పెరుగుతున్న నిరసనలను ఆ దేశ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా అధ్యక్షుడు జిన్ పింగ్ పై ఆన్ లైన్ లో వెల్లవెత్తుతున్న వ్యతిరేక కామెంట్లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఆన్ లైన్ సెన్సార్ షిప్ ను కఠినం చేసింది. వీపీఎన్ ల ద్వారా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను, చైనా అధికార మీడియాను కాకుండా, విదేశీ మీడియాను వినియోగించకుండా వీపీఎన్(VPN)లపై కఠిన ఆంక్షలు విధించింది. వీధుల్లో నిరసనలు తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిరసనలు తెలుపుతున్నవారిపై, నిరసనకారులకు నాయకత్వం వహిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు సమావేశాలు నిర్వహించడాన్ని, వీధుల్లో నినాదాలు చేయడాన్ని నిషేధించింది.