Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి
Visakha NAD Accident : విశాఖ-ఎన్ఏడీ ఫ్లై ఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బైక్ డీవైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు గాలిలోకి ఎగిరి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు.
Visakha NAD Accident : విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ-ఎన్ఏడీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వచ్చిన డ్యూక్ బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అతి వేగమే ప్రమాదానికి కారణం కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. యువకులు గంజాయి లేదా మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆటోను ఢీకొట్టిన లారీ
తెలంగాణలోని కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లేపల్లి నుంచి మాచర్ల వెళ్తున్న ఆటో.. పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొట్టించుకుని వస్తున్న హెడ్ కానిస్టేబుల్ మరియదాసు(57).. ఆటోను ఆపి డ్రైవర్‌తో మాట్లాడుతుండగా...ఆటోను వెనుక నుంచి లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మరియదాసు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న 10 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటోను ఢీకొట్టిన లారీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి మృతి చెందింది. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీవీ నటి పవిత్ర (42) దుర్మరణం చెందారు. కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో వేగంగా వస్తున్న వారి వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టింది. ఆ సమయంలో రోడ్డుకు కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదుపుతప్పిన వీరి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో త్రినయని సీరియల్‌లో మహిళ విలన్ పాత్రలో చేస్తున్న పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పవిత్ర బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ గాయపడ్డారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వాళ్లను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత కథనం