Maharashtra exit poll: మహారాష్ట్రలో విజయం మహాయుతిదే; పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా
20 November 2024, 19:02 IST
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) ల కూటమి మహాయుతి విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
మహారాష్ట్రలో విజయం మహాయుతిదే; పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగి ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
మహాయుతి వర్సెస్ ఎంవీఏ
బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి ఒక కూటమిగా.. కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే ), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాఢీ(ఎమ్వీఏ) మరో కూటమిగా ఈ ఎన్నికల్లో తలపడ్డాయి. ఈ ఎన్నికలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని తేలింది.
మహాయుతికి 182 సీట్లు..
288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 182 (175 -195) సీట్లు, ఎంవీఏ కూటమికి 97(85 -112) సీట్లు, ఇతరులకు 9 (7 -12) సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.
అతిపెద్ద పార్టీగా బీజేపీ..
మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్దగా అవతరించే అవకాశాలున్నాట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. బీజేపీ 113(102 నుండి 120) స్థానాలు, శివసేన (ఏక్ నాథ్ షిండే) పార్టీ 52 (42 నుండి 61) స్థానాలు, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ 17(14 నుండి 25) స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. మరోవైపు, కాంగ్రెస్ 35(24 నుండి 44) స్థానాలు, శివసేన (యూబీటీ) 27(21 నుండి 36) స్థానాలు, ఎన్సీపీ (శరద్ పవార్) 35 (28 నుండి 41) స్థానాలు, ఇతరులు 9 (6 నుండి 12) స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.
ఓట్ల శాతం వివరాలు..
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. ఈ ఎన్నికల్లో మహాయుతికి 49.8 శాతం, ఎంవీఏ కు 40.1 శాతం, ఇతరులకు 10.1 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ 31.3 శాతం, శివసేన (షిండే) 14.5 శాతం, ఎన్సీపీ (ఏపీ) 4 శాతం, కాంగ్రెస్ 13.7 శాతం, శివసేన (యూబీటీ) 13 శాతం, ఎన్సీపీ (ఎస్పీ) 10.1 శాతం, ఇతరులు 13.4 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి.
సీఎంగా షిండే కే మద్ధతు
ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని ఓటర్లను ప్రశ్నించగా ఏక్ నాథ్ శిండేకు 35.8 శాతం, ఉద్దవ్ ఠాక్రేకు 21.7 శాతం, దేవంద్ర ఫడ్నవీస్ కు 11.7 శాతం, రాజ్ ఠాక్రేకు 2.9 శాతం, అజిత్ పవార్ కు 2.3 శాతం, జయంత్ పాటిల్ కు 2.1 శాతం, నానా పాటోల్ కు 1.3 శాతం, ప్రకాశ్ అంబేద్కర్ కు 1.3 శాతం ఓటర్లు మద్దతిచ్చారు.
మహాయుతికే మహిళల మద్దతు
రాష్ట్రంలో మహిళల మద్దతు మహాయుతికే లభించింది. మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించింది. సామాజిక వర్గాల వారిగా పరిశీలిస్తే ముస్లింలు ఎంవీఏకు మద్దతివ్వగా, ఓబీసీలు మహాయుతివైపు మొగ్గు చూపారు. ఎస్సీల్లో రెండు కూటములకు దాదాపు సమానంగా మద్దతు లభించింది. ఎస్టీలు మహాయుతికే మద్దతు ప్రకటించారు. బౌద్దుల మద్దతు రెండు కూటములకు సమానంగా వచ్చే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల సపోర్ట్ ఎంవీఏకు
రంగాల వారిగా పరిశీలిస్తే రైతులు, ప్రయివేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు గృహిణులు మహాయుతి వైపు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్వీఏ వైపు నిలిచారు. మరాఠా, మార్వాడీ, ఉత్తర భారతీయులు, గుజరాతీయులు, దక్షిణ భారత ప్రజలు ఇలా అందరూ మహాయుతికే మద్దతుగా నిలిచారు. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర మహారాష్ట్ర, మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, ముంబాయి రీజియన్లలో మహాయుతి ఆధిపత్యం కనబరిచింది. లోక్ సభ ఎన్నికల్లో విదర్భ, ముంబాయి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారడంతో మహాయుతికి అవకాశాలు మెరుగ్గయ్యాయి.
లోక్ సభ ఫలితాలతో పోలిస్తే..
ఐదు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికలతో ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పోలిస్తే మహారాష్ట్ర ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహాయుతి కూటమి 17 (43.55%) , ఎంవీఏ కూటమి 30 (43.71%) పార్లమెంట్ స్థానాలు సాధించాయి. రెండు పార్టీల మధ్య సీట్లపరంగా 13 స్థానాల వ్యత్యాసం ఉన్నా, ఓట్ల శాతం పరంగా 0.16% మాత్రమే తేడా ఉంది. స్వల్ప వ్యత్యాసంతో భారీగా సీట్లు కోల్పోయిన మహాయుతి అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. మరోవైపు బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు స్వీకరించి క్షేత్రస్థాయిలో మహాయుతి విజయానికి తోడ్పడింది.
బాటేంగే తో కటేంగే
లోక్ సభ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల అంశంతో పాటు, బీజేపీ నినాదం ‘అబ్ కీ బార్, చార్ సౌ పార్’ వాస్తవం దాలిస్తే రాజ్యాంగానికే ముప్పు అనే ఎమ్వీఏ ప్రచారం మహాయుతికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ కూటమి నష్ట పోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి ముందే జాగ్రత్తపడిన బీజేపీ.. మరాఠాలు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అంచనాతో ఓబీసీలను అనుకూలంగా మల్చుకుంది. మరోవైపు ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ‘ఓట్ జిహాద్’ చేస్తున్నారని ప్రచారం చేస్తూ ‘బాటేంగే తో కటేంగే’ నినాదాన్ని ఎత్తుకొని భారీగా హిందువుల ఓట్లను కూడగట్టగలిగింది. ఈ ఎన్నికల్లో దీనికి మించి మరో ముఖ్యాంశం మహిళా ఓటర్లను ఆకర్షించడానికి మహాయుతి ప్రభుత్వం ‘మాజీ లడ్కీ బహిన్ యోజన’ పథకం కింద 2.34 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1500 అందించారు. భవిష్యత్తులో దీన్ని రూ.2100 కోట్లకు పెంచుతామని ప్రకటించారు. ఈ పథకం ఎన్నికల్లో మహాయుతికి సానుకూలంగా పనిచేసింది.
కులగణన ప్రభావం
కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ లోక్సభ ఎన్నికల తీరులోనే అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగం పరిరక్షణ అంశాన్ని కీలక ప్రచారాంశంగా మల్చుకుంది. మరోవైపు ఐదు గ్యారెంటీలతో పాటు కులగణన చేపడుతామని ప్రకటించి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే దీనికి పోటీగా ‘ఏక్ రహేంగేతో సేఫ్’ అంటూ ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా ప్రచారం చేశారు. మొత్తం మీద నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన ప్రజా సమస్యల కంటే భావోద్వేగాల అంశాలే ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. ఎన్నికల ప్రచారంలో మహాయుతి తరఫున ప్రధానంగా బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు సుడిగాలిలా పర్యటించగా, కాంగ్రెస్ మాత్రం కొంత వెనుకబ డిం ది. ఎమ్వీఏలో కాంగ్రెస్ తో పోలిస్తే శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మరోవైపు పార్టీల మధ్య సీట్ల పంపకాన్ని త్వరగా తేల్చుకోవడంలో మహాయుతితో పోలిస్తే ఎమ్వీఏ కొంచెం వెనుకబ డింది. బీజేపీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించగా, ఎమ్వీఏ మాత్రం చివరి నిమిషం వరకు సీట్ల సర్దుబాటు దోబుచులాడుతూ నష్టపోయింది.
చిన్న పార్టీల ప్రభావం
అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ప్రధానంగా ఎంఐఎం, వీబీఏ, బీవీఏ, ఎమ్ఎన్ఎస్ పార్టీలు సీట్లు సాధించడంలో వెనుకబడ్డా ఓట్లను చీల్చడంతో ఇతర పార్టీల గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించాయి. 2019 ఎన్నికల్లో 40 స్థానాలకు పైగా పోటీ చేసి రెండు సీట్లు సాధించిన ఎంఐఎం బీజేపీకి ‘బీ టీం అని అపవాదు ఎదుర్కోవడంతో ఈసారి 16 స్థానాల్లోనే పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ 21, 362 సాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. సంస్థ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో సీనియర్ రీసెర్చర్ జి.మురళీ కృష్ణ, ప్రదీప్, ఐ.వీ.మురళీ కృష్ణ శర్మ ఎగ్జిట్ పోల్ రిపోర్టును రూపొందించారు.