Khammam CPI(ML) : ప్రజలు ఇప్పుడిప్పుడే ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశ్నిస్తున్నారు- సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్
Khammam CPI(ML) : ఖమ్మంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పేరిట భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాయి. రాజకీయ సైద్దాంతిక అవగాహనతో వామపక్ష పార్టీలన్నీ కలిసి ముందుకు సాగుతాయన్నారు.
Khammam CPI(ML) : ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగ సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని, నియంతలను తలపిస్తుందని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నేతలు పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, ప్రజాస్వామికంగా వ్యవస్థలను ఇబ్బంది పెడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ, సీపీఐ (ఎంఎల్) ఆర్బీ పార్టీలు రాజకీయ సైద్దాంతిక చర్చల తర్వాత సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పేరుతో ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నేత ప్రదీప్ సింగ్ ఠాగూర్... మాట్లాడుతూ ఐక్యతకు ముందు గతంలో జరిగిన ఓ పెద్ద తప్పిదాన్ని విప్లవ పార్టీలు గుర్తించాయని ఆ తప్పిదాన్ని సరి చేసేందుకు భవిష్యత్తులో బలమైన విప్లవోద్యమ నిర్మాణం కోసం మాస్ లైన్ అవతరించాయన్నారు. ఇక ముందు రాజకీయ సైద్దాంతిక అవగాహనతో ముందుకు పోవడమే గాక పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.
ఖమ్మంలో మహాసభ
ఖమ్మం నగరంలో విప్లవ పార్టీల ఐక్యత మహాసభ జరగడం సంతోషకరమని, ఈ ప్రాంతం అనేక ప్రజా ఉద్యమాలకు వేదికగా నిలిచిందని ఠాగూర్ తెలిపారు. సీపీఐ ఆ తర్వాత సీపీఎం ఏర్పడిందని సీపీఎం నుంచి నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, సండ్ర పుల్లారెడ్డి లాంటి వారు చీలిన తర్వాత రాను రాను విప్లవ పార్టీలు బలహీనపడ్డాయని చీలికే ఈ బలహీనతకు కారణమన్నారు. మొట్టమొదటి సారి విప్లవ పార్టీలు కలిసి అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీగా అవతరించాలనే లక్ష్యంతో సభలు నిర్వహిస్తున్నామని ఇది ఒక చారిత్రాత్మకమైన రోజని ఠాగూర్ పేర్కొన్నారు. పెట్టుబడిదారి సమాజం నుంచి సోషలిజం సమాజం వైపు ప్రజలను మళ్లీంచేందుకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పని చేస్తుందన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, ప్రజాస్వామికంగా వ్యవస్థలను ఇబ్బందులు పెడుతున్న ప్రస్తుత పాలకుల తీరుపై అన్ని విప్లవ పార్టీలు ఒక వేదికగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అది కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరగాలని ఠాగూర్ తెలిపారు. ఐక్యత ఉద్దేశం, లక్ష్యం ఫాసిస్టు వ్యతిరేక పోరాటమేనన్నారు. పాలకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మెజార్టీ, మైనార్టీ ప్రతిపాదికన మతాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశ్నిస్తున్నారని దీనికి మాస్ లైన్ మరింత ఉతమిస్తుండన్నారు.
ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు
నితీష్ కుమార్ రంగు దేశ ప్రజలు గ్రహించారని ఇదే సమయంలో ప్రశ్నించే గొంతులపై బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ప్రయోగిస్తూ భయపెడుతుందని, జైళ్లకు పంపుతుందని ప్రదీప్ కుమార్ ఠాగూర్ ఆరోపించారు. బీజేపీకి ప్రత్యామ్నాయం అంటూ "ఇండియా వేదిక వస్తుందని కానీ అది రాజకీయ ప్రత్యామ్నాయమే కానీ మరొకటి కాదన్నారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అధికారానికి మాత్రమే కానీ బీజేపీ వ్యతిరేక విధానాలకు కాదన్న ఠాగూర్ కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే సరళికర విధానాలను అమలు చేస్తున్నారని విపక్షంలో ఉంటే వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ దేశంలో సంక్లిష్ట స్థితి నెలకొందని ఇటువంటి పరిస్థితులలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మూడు విధానాలతో ముందుకు సాగుతుందన్నారు. ఒకటి విప్లవ పార్టీల ఐక్యత, రెండోది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానాలపై పోరాటం, మూడోది ప్రజా హక్కుల రక్షణ తదితర విషయాలపై ప్రజా పోరాటాలని ఠాగూర్ తెలిపారు.
భారీ ప్రదర్శన
సభకు ముందు ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పటేల్ మైదానం నుంచి కళాకారులు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది పెవిలియన్ మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. విచిత్ర వేషాలు, డప్పునృత్యాల మధ్య ప్రదర్శన ఖమ్మం పురవీధులను ఎరుపెక్కించింది. గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మోదీ వేషధారణ, కార్పొరేట్ శక్తుల విధానాలకు సంబంధించి ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అరుణోదయ కళాకారుల ఉద్యమ గీతాలు బహిరంగ సభకు హాజరై న ప్రజలను ఊర్రూతలూగించాయి.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.