Maharashtra Politics: ఎన్నికల కమీషనర్ల కోసం ఎన్నిక జరగాలి: ఉద్దవ్ ఠాక్రే సరికొత్త డిమాండ్
Maharashtra Politics: ఎన్నికల సంఘాన్ని తక్షణమే రద్దు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రజలే ఎన్నుకునేలా విధంగా కొత్త విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరిన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. తన శివసేన పార్టీ పేరును, ఎన్నికల గుర్తును షిండే వర్గానికి కోల్పోయాక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 20) కూడా ఈ విషయంపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని (CEC)ని రద్దు చేయాలని అన్నారు. ఎన్నికల కమిషనర్లను ప్రజలు ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకునే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ తండ్రి బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ పేరును, గుర్తును ఆ పార్టీ నుంచి చీలిపోయి సీఎం పీఠమెక్కిన ఏక్‍నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి ఎన్నికల సంఘం తాజాగా కేటాయించింది. దీనిపై నేడు సుప్రీం కోర్టులో ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇలా ఎప్పుడూ జరగలేదు
Maharashtra Politics: పార్టీ పేరును, గుర్తును నేరుగా ఓ వర్గానికి ఇచ్చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఉద్ధవ్ అన్నారు. “నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? నా నుంచి సమస్తం దోచేసుకున్నారు. అయినా మీరు ఇక్కడ ఎందుకున్నారు?” మా పార్టీ పేరును, గుర్తును ఇంకో వర్గం దోచేసినా.. వారు మా ఠాక్రే పేరును తీసుకోలేరు. బాలాసాహెబ్ ఠాక్రే కుటుంబంలో జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఢిల్లీ సాయంతోనూ వారు ఇది పొందలేరు” అని ఠాక్రే అన్నారు.
ఎప్పటి నుంచో కుట్ర
Maharashtra Politics: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‍నాథ్ షిండే వర్గానికి కట్టబెట్టేందుకు ఎప్పటి నుంచో కుట్ర జరుగుతోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజాస్వామ్య సంస్థల సాయంతోనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. “మాకు ఈ రోజు బీజేపీ ఏం చేసిందో.. ఎవరితో అయినా ఇలా చేయగలదు. ఒకవేళ ఇది కొనసాగితే.. 2024 తర్వాత, దేశంలో ఇక ప్రజాస్వామ్యం, ఎలక్షన్లు ఉండవు” అని ఠాక్రే విమర్శించారు.
కాగా, ఆదివారం కూడా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పేరును, గుర్తును లాక్కున్నందుకు ముగాంబోకు సంతోషంగా ఉందంటూ అమిత్ షాను ఉద్దేశించి అన్నారు. 1993 ముంబై వరుస పేలుళ్ల సమయంలో మోదీ భయపడ్డారని వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ, ఎప్పటికీ హిందుత్వవాదినేనని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
సంబంధిత కథనం