BRS vs Congress : తెలంగాణకు తరతరాల దరిద్రం కాంగ్రెస్ : కేటీఆర్
BRS vs Congress : కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. తెలంగాణకు తరతరాల దరిద్రం కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్‌ను కేటీఆర్ తప్పుబట్టారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉంటే కదా అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందని, దేశానికి రోల్ మోడల్ కాబోతున్నారని రాహుల్ గాంధీ చెప్పినట్టు.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై, తెలంగాణ ప్రభుత్వంపై తన స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
'రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా.. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా. ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి? తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా? అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా?? కొడంగల్‌లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ?? కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ??' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ?? హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా ?? ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ?? రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ?? తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా ?? సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా ??' ఏని కేటీఆర్ నిలదీశారు.
'తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ?? ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోంది. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుంది' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీపై..
'రాహుల్ గాంధీ గారూ.. మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం? అదానీ - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం? దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన.. తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది? కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది? అదానీ -అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదాని ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది? తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా! ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా? కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా? రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా? అదానీ - అంబానీలపై మీ పోరాటం ఓ భూటకం.. తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.