Navya Haridas: వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక పోరులో ప్రియాంక గాంధీతో తలబడ్తున్న నవ్య హరిదాస్ ఎవరు?
Priyanka Gandhi: వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ నవ్య హరిదాస్ అనే యువ నాయకురాలిని బరిలో నిలిపింది.
Navya Haridas: వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ చాన్నాళ్ల క్రితమే ప్రకటించింది.
రాహుల్ గాంధీ రాజీనామాతో..
గత లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్, ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ స్థానాల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పోటీ చేసి, రెండు స్థానాల నుంచి గెలుపొందారు. ఆ తరువాత, రాయ్ బరేలీ సీటులో కొనసాగాలని నిర్ణయించుకుని, వాయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో, ఆ లోక్ సభ స్థానానికి నవంబర్ లో ఉప ఎన్నిక జరుగుతోంది.
నవ్య హరిదాస్ ఎవరు?
వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దిగ్గజ నేత ప్రియాంక గాంధీని బీజేపీ యువ నాయకురాలు నవ్య హరిదాస్ (Navya Haridas) ఎదుర్కొంటున్నారు. నవ్య హరిదాస్ (36) కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి 2007 లో బీటెక్ పూర్తి చేశారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్ లో రెండుసార్లు కౌన్సిలర్ గా, బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నవ్య హరిదాస్ తన ఫేస్ బుక్ పేజీలో తనను తాను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, బీజేఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్య హరిదాస్ కు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
నవ్య హరిదాస్ వర్సెస్ ప్రియాంక గాంధీ వాద్రా
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను వయనాడ్ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రియాంక అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత మల్లిఖార్జున ఖర్గే (mallikarjun kharge) నేతృత్వంలోని ఆ పార్టీ రాహుల్ గాంధీ కన్నా మెరుగైన మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ప్రచార ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు, విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన సీపీఐ కూడా వాయనాడ్ బరిలో తమ అభ్యర్థిని నిలపడం ప్రియాంక గాంధీ (priyanka gandhi) కి కొంత ఇబ్బందికర విషయమేనని స్థానిక నేతలు భావిస్తున్నారు. సీనియర్ నేత సత్యన్ మొకేరిని వాయనాడ్ స్థానం నుంచి బరిలోకి దింపాలని సీపీఐ నిర్ణయించింది.