Nagarkurnool MP Ramulu : బీఆర్ఎస్ ను వీడిన మరో సిట్టింగ్ ఎంపీ - బీజేపీలో చేరిన రాములు-brs nagarkurnool mp pothuganti ramulu joins the bjp at party headquarters in new delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagarkurnool Mp Ramulu : బీఆర్ఎస్ ను వీడిన మరో సిట్టింగ్ ఎంపీ - బీజేపీలో చేరిన రాములు

Nagarkurnool MP Ramulu : బీఆర్ఎస్ ను వీడిన మరో సిట్టింగ్ ఎంపీ - బీజేపీలో చేరిన రాములు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 29, 2024 04:44 PM IST

BRS Nagarkurnool MP Pothuganti Ramulu: బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు. ఢిల్లీ వేదికగా బీజేపీ పార్టీలో చేరారు.

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు

BRS Nagarkurnool MP Pothuganti Ramulu: పార్లమెంట్ ఎన్నికల వేళ మరో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీని వీడారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు… గురువారం ఢిల్లీ వేదికగా బీజేపీలో చేరారు. జెడ్పీటీసీగా ఆయన కుమారుడు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. 

పోతుగంటి రాములు…. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ . ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం(Nagarkurnool Lok Sabha constituency) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన… ఆ తర్వతా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కుమారుడైన భరత్ కల్వకుర్తి జడ్పీటీసీగా కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన కుమారుడు భరత్ ను జెడ్పీ ఛైర్మన్ గా చేసేందుకు కూడా పావులు కదిపారు రాములు. కానీ పార్టీలోని పలువురు నేతల నుంచి అభ్యంతరాలు రావటంతో…. సీన్ మారిపోయింది. అప్పట్నుంచి అసంతృప్తిగానే ఉన్నారు రాములు.

గతేడాది చివర్లో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కుమారుడిని అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ…. అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల్ రాజుకే సీటు ఖరారు చేసింది బీఆర్ఎస్ అధినాయకత్వం. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అంసతృప్తితో ఉన్న రాములు…. పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా జరిగింది. అయితే తాజాగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన కనిపించలేదు. ఇందుకు వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్(KTR) హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు(MP Pothuganti Ramulu) కనిపించకపోవటంతో….ఆయన విషయంలో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.

ఎంపీ రాములు… బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ మొదట్లో వినిపించింది. ఇప్పటికే మందా జగన్నాథం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. రాములు కూడా టికెట్ ఖరారుపైనే ఆశలు పెట్టుకున్నారని… మరోసారి బరిలో ఉండాలని చూస్తున్నారని సమాచారం. కానీ కాంగ్రెస్ లో మల్లు రవి, జగన్నాథం, సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో… రాములుకు టికెట్ దక్కకపోవచ్చన్న చర్చ కూడా ఓ సైడ్ నుంచి వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే…. రాములు బీజేపీలో చేరారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బీజేపీలో సిట్టింగ్ ఎంపీ రాములు చేరిన నేపథ్యంలో…. ఎస్సీ రిజర్వ్ డు నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ నుంచి మరోసారి ఆయన బరిలో ఉండే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ పోటీలో ఉండకపోతే… ఆయన కుమారుడు భరత్ కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇప్పటికే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేశ్ కూడా పార్టీని వీడారు. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం.

Whats_app_banner