Sangareddy : లగచర్ల ఘటనలో కాంగ్రెస్‌కు చెందినవారిని వదిలేశారు : బీజేపీ
Sangareddy : లగచర్ల లడాయి ఢీల్లీకి చేరింది. ఆ గ్రామస్తులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటు సంగారెడ్డి జైల్లో ఉన్న నిందితులను బీజేపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్, డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులతో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ మాట్లాడారు. రైతులను పరామర్శించారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమంటూ.. ఎనిమిది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని ఎంపీలు వ్యాఖ్యానించారు. బలవంతంగా భూములు లాక్కుంటామంటేనే రైతులు ఆగ్రహించారని చెప్పారు.
'లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. ఘటనలో కాంగ్రెస్‌కు చెందినవారిని వదిలేశారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలి. రేవంత్‌కు ప్రజల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా. రేవంత్ కొడంగల్ వాసి కాదు.. వలస వచ్చారు. కాంగ్రెస్ వాళ్లే ఈ దాడులు చేయించారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తాం. బడా కంపెనీలకు భూములు అప్పజెప్పడం వెనుక మతలబేంటి.. రియల్ఎస్టేట్ కోసం భూములు ఇస్తే ఊరుకోం' అని బీజేపీ ఎంపీలు స్పష్టం చేశారు.
అటు లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీకి వెళ్లారు. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘానికి, ఎస్సీ కమిషన్‌కు, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీరివెంట మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. లగచర్ల ఫార్మా బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు మహిళా కమిషన్‌ను కోరారు.
కాంగ్రెస్, బీజేపీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్‌ఎస్ పాలన ఎలా ఉందో కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉంది. ఏ మాత్రం మార్పు రాలేదని ప్రజలు బాధపడుతున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగదు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయంగా మారిపోయింది. ఈ రెండు పార్టీల వల్ల రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. బీఆర్ఎస్ సుద్దపూస అయినట్టు ఇప్పుడు మాట్లాడుతోంది' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు లగచర్ల దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం లగచర్ల, రోటిబండ, పులిచర్లకుంటలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. సురేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం తమ వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని.. బాధిత రైతు, గిరిజన కుటుంబాల సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను ఇటీవల కలిసి ఫిర్యాదు చేశారు. మణిపుర్‌లో మహిళలపై దాడి జరిగితే రాహుల్ గాంధీ వెళ్లి పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని, లగచర్లకు కూడా ఆయన రావాలని డిమాండ్ చేశారు.