Lord Shiva, Hanuman temple: సంభాల్ లో 46 ఏళ్ల తరువాత బయటపడిన శివుడు, హనుమంతుడి ఆలయం
14 December 2024, 18:47 IST
Lord Shiva, Hanuman temple: ఉత్తర ప్రదేశ్ లో 46 సంవత్సరాల తరువాత ఒక పురాతన ఆలయాన్ని తిరిగి తెరిచారు. యూపీలోని సంభాల్ లో 1978లో ఆక్రమణలకు గురైన ఈ ఆలయాన్ని ఇప్పుడు మళ్లీ గుర్తించి, తెరిచారు. ఈ ఆలయంలో మళ్లీ పూజలు జరపేందుకు స్థానికులు ప్రయత్నాలు ప్రారంభించారు.
46 ఏళ్ల తరువాత బయటపడిన శివాలయం
Lord Shiva, Hanuman temple: ఉత్తర్ ప్రదేశ్ లో ఆక్రమణకు గురైన ఆలయాన్ని సంభాల్ యంత్రాంగం, పోలీసులు గుర్తించారు. ఈ ఆలయంలో శివుడు, హనుమంతుడి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై ఉక్కుపాదం మోపడం లక్ష్యంగా ప్రారంభించిన ఈ డ్రైవ్ లో ఈ ఆలయం బయటపడింది. నఖాసా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు దాడులు చేసిన సమయంలో ఈ ఆలయాన్ని గుర్తించారు.
1978 వరకు పూజలు.
సంభాల్ సీఓ అనూజ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ఓ ఆలయం ఆక్రమణకు గురయినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు అక్కడ శివలింగం (lord shiva), నందీశ్వరుడు, హనుమంతుడి విగ్రహం ఉన్న ఆలయం కనిపించిందని చెప్పారు. 1978 వరకు ఈ ఆలయంలో పూజలు జరిగాయని, ఆ తరువాత ఈ ప్రాంతం ఆక్రమణలకు గురైందని వివరించారు. 1978 తర్వాత ఆలయాన్ని తిరిగి ఇప్పుడు మళ్లీ తెరిచారని నాగర్ హిందూ సభ పోషకుడు విష్ణు శరణ్ రస్తోగి పేర్కొన్నారు. ఆలయాన్ని శుభ్రం చేశామని తెలిపారు.
ఆక్రమణలపై చర్యలు
ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. ‘‘ఆలయంలో శివుడు, హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. కొన్ని హిందూ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించేవని, కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారని తెలిసింది. ఆలయానికి సమీపంలోనే ఓ పురాతన బావి గురించి కూడా సమాచారం ఉంది' అని ఆ అధికారి తెలిపారు. సంభాల్ లో ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా తెలిపారు.