హనుమంతుడికి దయ్యాలు, భూతాలు భయపడతాయని ఎందుకంటారో తెలుసా?
Dharma Sandehalu: హిందూ పురాణాల ప్రకారం, శివుని పదకొండవ అవతరాం హనుమంతుడు. అద్భుతమైన శక్తులు, అపారమైన మహిమలు కలిగి ఉన్న భజరంగబలి పేరు విన్నా, ఆయన ప్రతిమ చూసినా దుష్ట శక్తులు, పిశాచాలు హడలిపోతాయని చెబుతుంటారు.
కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవుడు హనుమంతుడు. భూమిపైన యుగాంతం వరకూ నిలిచి ఉండే చిరంజీవుల్లో ఆయనొకరు. ఆంజనేయుని శరణు కోరిన వారికి ఎటువంటి దుఃఖాలు, కష్టాలు కలగబోవని పురాణాలు చెబుతున్నాయి. గ్రామాల్లో, కొన్ని ప్రత్యేకమైన ఆలయాల్లో దుష్ట శక్తుల బారిన పడిన వారి బాధలు తగ్గించేందుకు హనుమాన్ చాలీసా చదువుతుంటారు. దాదాపు పనిలో నీరసించిపోయినప్పుడు లేదా భయానికి గురైనప్పుడు జై భజరంగబలి లేదా జై హనుమాన్ అని తలచుకుని పనికి దిగుతారు. ఈ తరహాలోనే చాలా కాలం నుంచి పట్టిపీడిస్తున్న దెయ్యాలు, ఆత్మలు వంటి ప్రతికూల శక్తులు కూడా హనుమాన్ పేరు వినగానే పారిపోతాయని నమ్ముతుంటారు. అసలు ఎందుకిలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.. రండి తెలుసుకుందాం.
హనుమాన్ అంటే ఆ పరమశివుడి పదకొండవ అవతారంగా పరిగణిస్తారు. ఆది దేవుడు మానవులకే కాదు దేవతలకు, రాక్షసులకు కూడా తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. సాక్షాత్ శివుని స్వరూపమైన హనుమంతుని చూసి సకల దేవతలు, రాక్షసులు భయపడిపోతుంటారు. శివుడిని గౌరవించినట్లే ప్రేతాత్మలు ఆంజనేయుని ఆదేశాలను పాటిస్తూ చెప్పినట్లు వింటాయి. శివుడికి కోపం వచ్చినట్లే, హనుమంతుడికి కోపం వచ్చినా కూడా సృష్టి అల్లకల్లోలం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకు ఆగ్రహం తెప్పించేలా వ్యవహరించకుండా, ఆలస్యం చేయకుండా దెయ్యాలు, పిశాచాలు వెంటనే తోక ముడుచుకుని పారిపోతాయట. ఆ వాయునందనుడిని శరణు కోరిన భక్తులకు కష్టాలు, ఇబ్బందుల నుంచి విముక్తి ప్రస్తాదిస్తాడని విశ్వసిస్తారు. దివ్య శక్తులు ఉన్న హనుమంతుడు దయామయుడని కూడా కీర్తిస్తారు.
హనుమంతునికి వరం:
దేవతలు ఇచ్చిన వరంతో యముడు, శని, రాహువు, కేతువులు సైతం హనుమంతుడిని తాకలేవు. అందుకే ఆంజనేయుని శరణుకోరిన భక్తులను కూడా ఆ శక్తులు ఏమీ చేయలేవు. అందుకే దెయ్యాలు, దుష్టశక్తుల నుంచి కష్టకాలం ఎదుర్కొంటున్నప్పుడు హనుమాన్ ఆశ్రయం కోరుకుంటారు. అపవిత్ర శక్తులు, ప్రతికూల శక్తుల నుంచి కాపాడమని వేడుకుంటారు. శని దోషం, రాహు దోషం ఉన్న వారు కూడా హనుమంతుని ప్రార్థిస్తే కాస్త ఉపశమనం దొరుకుతుందని పెద్దలు చెబుతుంటారు.
అంతేకాకుండా హనుమాన్ చాలీసాలో చెప్పినట్లు ఆంజనేయుడు ఎనిమిది విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇషిత్వ, వశిత్వ అనే ఎనిమిది సిద్ధులు ప్రాప్తించాయి. ఇది ఏ దేవుడికి, మానవునికి కూడా సాధ్యం కాదు. అందుకే ఆయనను చూసి దెయ్యాలు, భూతాలు భయపడతాయి. అందుకే చిన్న పిల్లలు నుంచి యుక్త వయస్సున్న వారు కూడా హనుమంతుని లాకెట్ మెడలో ధరించి తమకు ధైర్యం ప్రసాదించమని వేడుకుంటారు. మరికొందరైతే హనుమాన్ బొమ్మను వాహనాల్లో ఉంచుకుని తమకు ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోమని ఆంజనేయుని ప్రార్థిస్తారు. మంగళవారం ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకార్చనలతో పాటు హనుమంతుని పేరు మీద మాలధారణం కూడా చేపడతారు.