ఈ ఆలయాన్ని కట్టేందుకు నీరు కాదు నెయ్యి ఉపయోగించారట- ఎందుకో తెలుసా?
సాధారణంగా ఏదైనా భవనాలు, ఆలయాలు నిర్మించేందుకు నీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ ఆలయానికి మాత్రం నెయ్యి ఉపయోగించి కట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు నెయ్యి వినియోగించారో మీరు తెలుసుకోండి.
Temple: మన దేశంలో ఒక్కో ఆలయానికి విభిన్నమైన కథలు ఉన్నాయి. అనేక రహస్యాలతో నిండి ఉన్నాయి. విగ్రహం మీద పోసే వేడి నీరు చివరకు వచ్చే సరికి చల్లగా మారిపోతుంది. కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. అలాంటిది మన దగ్గర ఉన్న విచిత్రమైన ఆలయమ భండాసర్ దేవాలయం.
ఆలయం నిర్మాణంలో సిమెంట్, ఇసుక, నీటిని ఉపయోగిస్తారు. కానీ ఈ ఆలయం నిర్మాణానికి మాత్రం నెయ్యి వినియోగించారు. కేజీ రెండు కేజీలు నామ మాత్రంగా కాదండోయ్ ఏకంగా 40 వేల కేజీల నెయ్యి ఉపయోగించారు. ఆ ఆలయం మరెక్కడో కాదు రాజస్థాన్ లోని భండాసర్ ఆలయం. 15వ శతాబ్ధంలో బండా షా ఓస్వాల్ అనే సంపన్న వ్యాపారి దీన్ని నిర్మించారు. జైనమతంలోని ఐదవ తీర్థంకరుడైన సుమతీనాథ్ కు ఈ ఆలయం అంకితం చేశారు.
అనేక జైన దేవాలయాల వలె ఇది కూడా చక్కని శిల్పాలు, రంగు రంగుల కుడ్య చిత్రాలతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మూడు అంతస్తులలో దీన్ని నిర్మించారు. ప్రతి ఒక్కటి జైన సంస్కృతిని చూపిస్తుంది. గోడలు, స్తంభాలు, పైకప్పులు అన్నీ అందమైన పెయింటింగ్స్, కళాకృతులతో ఉంటాయి. వివిధ జైన తీర్థంకరుల జీవితాల దృశ్యాలను చూపుతాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక వైవిధ్యభరితమైన కథలు ఉన్నాయి.
నీటికి బదులుగా నెయ్యి వాడటం అవాస్తవమని కొందరు కొట్టేపడేస్తారు. అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు. మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. నీటి కొరత వల్ల ఇలా నెయ్యి ఉపయోగించారని మరికొందరు వాదిస్తారు. ఏది అయితేనేం ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకతతో ఉంటుంది.
నెయ్యి ఎందుకు ఉపయోగించారంటే?
ఈ ఆలయాన్ని నెయ్యితో నిర్మించడం వెనుక అత్యంత ప్రాచుర్యం పొందిన కథలలో ఒకటి ఇది. బండా షా భూమిలో ఆలయాన్ని నిర్మించమని గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా తక్కువ నీరు ఉందని అవి ఉపయోగిస్తే తమ మనుగడకు సరిపోదని గ్రామస్తులు చెప్పారు. ఆలయం పూర్తవుతుంది కానీ ప్రజలు ఆకలితో అలమటిస్తారని అన్నారు. కానీ బండా షా ధృడనిశ్చయంతో ఆలయ నిర్మాణానికి నీటిని బదులు నెయ్యితో కట్టాలని నిర్ణయించుకున్నాడు.
తాపీ మేస్త్రీ పొరపాటు
ఒక సారి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఏమి అవసరమో అంచనా వేయడానికి బందా షా తాపీ మేస్త్రీని పిలిపించాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఈగ నెయ్యి పాత్రలో పడింది. బండా షా ఈగను తీసేసి నెయ్యి వృధా కాకుండా తన బూట్లపై రుద్దాడు. అది చూసిన తాపీ మేస్త్రీ ఈయన డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉన్నాడని భావించి నీటికి బదులుగా నెయ్యితో ఆలయాన్ని నిర్మించమని కోరాడట. అలా చేస్తే నిర్మాణం మరింత ధృడంగా ఉంటుందని ఎక్కువ కాలం పగుళ్లు రాకుండా ఉంటాయని తాపీ మేస్త్రీ వాదించాడు. మొత్తం ఆలయాన్ని పూర్తి చేయడానికి కనీసం 40,000 కిలోల నెయ్యి అవసరమని చెప్పాడట.
మరుసటి రోజు బండా షా తాపీ మేస్త్రీకి కావలసిన నెయ్యిని అందించాడు. తాపీ మేస్త్రీ కంగారుపడి డబ్బు విషయంలో మీరు గట్టిగా ఉన్నారని ఆ విషయంలో పరీక్షించడం కోసం నెయ్యి కావాలని అదిగినట్టు చెప్తాడు. బండా షా ఆగ్రహానికి గురైనప్పటికీ తాను ఇప్పటికే దేవుడి పేరుతో నెయ్యిని దానం చేశానని దానిని వెనక్కి తీసుకోలేనని అందుకే ఇప్పుడు దానితో నిర్మాణం ప్రారంభించాలని చెప్పాడు. అలా నెయ్యితో ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ చాలా వేడిగా ఉన్న సమయంలో ఆలయం లోపల కాళ్ళు జారతాయి. అందుకు కారణం నెయ్యి బయటకు వస్తుందని కొందరు అంటుంటారు. నెయ్యితో ఆలయం నిర్మించారు అనేందుకు ఇదొక సాక్ష్యంగా చెప్తారు.
టాపిక్