Medak Crime News : యూట్యూబ్ లో చూసి అతి పురాతన పార్శ్వనాథుడి విగ్రహం చోరీ - ఏపీ బీటెక్ విద్యార్థులు అరెస్ట్..!
యూట్యూబ్ లో సమాచారం తెలుసుకొని అతి పురాతన పార్శ్వనాథుడి విగ్రహాన్ని కొందరు యువకులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం అందటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
జల్సాలకు అలవాటుపడి సులభంగా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. యూట్యూబ్ లో చూసి అతి పురాతనమైన పార్శ్వనాథ తీర్థంకర విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్లే పని పూర్తి చేశారు. అయితే దొంగిలించిన విగ్రహాన్ని అమ్మడానికి ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఆగస్టు 30న ఫిర్యాదు…
మెదక్ ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వెలుపుగొండ గుట్టపై జైన మతానికి చెందిన అతి పురాతన పార్శ్వనాథుడు తీర్థంకర విగ్రహం కొలువై ఉంది. ఆ విగ్రహం అపహరణకు గురైదని ఆగష్టు 30 న గ్రామస్థులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 4 న అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది.చోరీకి గురైన విగ్రహాన్ని గుర్తించారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఏపీకి చెందిన బీటెక్ యువకులు......!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన చిలుకురి అరవింద్, తోట జగత్, పెద్దపేటకు చెందిన బందెల శుభనంద్, కృష్ణాజిల్లా నారాయణరావు నగర్ కు చెందిన పోలిశెట్టి తేజసాయిబాబు, కోటరెడ్డిపేటకు చెందిన జొన్నలగడ్డ మహేష్ బాబు లు బీటెక్ చదివి హైదరాబాద్ లో కలిసి ఉంటున్నారు. పురాతన విగ్రహాలను విక్రయించడం ద్వారా సులభంగా అధిక డబ్బులు సంపాదించవచ్చని యూట్యూబ్ లో తెలుసుకున్నారు. ఈజీ మనీ సంపాదించాలనే దురాశతో గూగుల్, యూట్యూబ్లో ఆదరణ లేకుడా ఉన్న పురాతన దేవాలయాలు, విగ్రహాల గురించి వెతికారు.
అందులో టేక్మాల్ మండలం వెలుపుగొండ గుట్టపై జైన మతానికి చెందిన అతి పురాతన పార్శ్వనాథుడు తీర్థంకర పురాతన విగ్రహం గురించి వారికి తెలిసింది. దీంతో ఆ విగ్రహాన్ని చోరీ చేసి అమ్మడం వల్ల అధికంగా డబ్బులు సంపాదించవచ్చనే నిర్ణయానికి వచ్చారు. వెంటనే విగ్రహాన్ని దొంగిలించడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించుకున్నారు.
ఈ క్రమంలో జూలై 25 వ తేదీన అనువిన్ జగన్ వేల్పుగొండకు వచ్చి విగ్రహం ఉన్నచోట పరిశీలించారు. మరుసటి రోజు 26 జూలై అర్ధరాత్రి ఐదుగురు యువకులు ఒక వాహనం తీసుకొని వేల్పుగొండకు వచ్చారు. వారు అనుకున్నట్లుగా పథకం ప్రకారం ఇక్కడి నుండి విగ్రహాన్ని అపహరించుకొని వెళ్లారు.
దొంగిలించిన విగ్రహాన్ని అక్టోబర్ 4న అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టేక్మాల్ ఎస్సై రాజేష్ తన బృందంతో వెళ్లి పట్టుకున్నారు. అనంతరం టేక్మాల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారణ చేయడంతో విగ్రహాన్ని అపహరించినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి నేరస్తులను రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
టాపిక్