Lok Sabha elections 2024 : ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 40 సీట్లు కూడా రావు’- మమత!
06 February 2024, 12:44 IST
Mamata Banerjee on Congress : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మమతా బెనర్జీ. ఎన్నికల్లో.. కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా వస్తాయా? అని అనుమానం వ్యక్తం చేశారు.
‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 40 సీట్లు కూడా రావు’- మమత!
Mamata Banerjee latest news : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు పెరుగుతోంది! బీజేపీలో చేరి.. ఇప్పటికే ఇండియా కూటమికి షాక్ ఇచ్చారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఇక ఇప్పుడు.. కాంగ్రెస్‌పై బంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన విమర్శలు.. కూటమిలో విభేదాలను మరోమారు బయటపెట్టాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం కూడా అనుమానమే అని ఆమె వ్యాఖ్యానించారు. బంగాల్లో సీట్ షేరింగ్ అంశంపై ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే మమత ఈ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ విమర్శలు..
ఇటీవలే బెంగాల్‌లోని ఆరు జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర. దీనిపై మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. అది కేవలం ఫొటో షూట్ అని, రాష్ట్రంలోని మైనారిటీ ఓట్లను చీల్చేందుకు వలస పక్షి వచ్చిందని మండిపడ్డారు.
Mamata Banerjee India : "బీజేపీ నుంచి బలమైన పోటీ ఎదురయ్యే 300 సీట్లల్లో పోటీ చేయాలని నేను కాంగ్రెస్‌కి సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఇప్పుడు.. రాష్ట్రానికి వచ్చి ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. అసలు.. 300 సీట్లల్లో పోటీ చేసినా, కాంగ్రెస్‌కు కనీసం 40 సీట్లైనా వస్తాయా? అన్నది నాకు అనుమానంగా ఉంది," అని మమతా బెనర్జీ అన్నారు.
"2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్లో కూటమిగా ఏర్పడేందుకు నేను సిద్ధమని కాంగ్రెస్‌కి చెప్పాను. కానీ వాళ్లు వినలేదు. రెండు సీట్లు ఇస్తామని అన్నాను. ఒప్పుకోలేదు. వాళ్లని 42 సీట్లల్లో పోటీ చేసుకోనివ్వండి. ప్రస్తుతానికైతే రెండు పార్టీల మధ్య సీట్ల సద్దుబాటు విషయంలో మాటలు జరగడం లేదు. బంగాల్లో బీజేపీని ఓడించేందుకు మేము ఒంటరిగా పోటీ చేస్తాము," అని టీఎంసీ అధినేత్రి స్పష్టం చేశారు.
2024 Lok Sabha elections : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. పశ్చిమ్ బంగాల్లోని ఉత్తర దినాజ్‌పూర్, మాల్ది, మర్షిదాబాద్ వంటి మైనారిటీ ప్రాంతాల్లో జరిగింది. ఈ ప్రాంతాలపై కాంగ్రెస్‌కు అనాదిగా పట్టు ఉంది. కానీ ఇప్పుడు.. ఆయా ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటనలపై మమతా బెనర్జీ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం.
"ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాము. కానీ రాష్ట్రంలో యాత్ర చేస్తున్నట్టు కాంగ్రెస్ మాకు చెప్పలేదు. అధికారులు చెబితేనే తెలిసింది. డారెక్ ఒబ్రెయిన్ (టీఎంసీ ఎంపీ)కి ఫోన్ చేసి, ర్యాలీకి అనుమతివ్వాలని కోకారు. మరి పశ్చిమ్ బెంగాల్‌కు రావడం ఎందుకు?" అని తన అసంతృప్తిని బయటపెట్టారు మమతా బెనర్జీ.
పశ్చిమ్ బెంగాల్లో 'ఇండియా'కు కష్టమేనా..?
West Bengal politics : మోదీని ఢీకొట్టడానికే ఇండియా కూటమి ఏర్పడింది. కానీ అది అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా.. పశ్చిమ్ బెంగాల్లో కూటమికి.. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయని అంటున్నారు.
పశ్చిమ్ బెంగాల్లో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐఎం పార్టీలు కీలకంగా ఉన్నాయి. బీజేపీని పక్కన పెడితే.. టీఎంసీ- సీపీఐఎం మధ్య శత్రుత్వం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. వాస్తవానికి.. సీపీఐఎం ప్రభుత్వాన్ని గద్దె దించే.. సీఎం అయ్యారు మమతా బెనర్జీ. ఇక సీపీఐఎం- కాంగ్రెస్‌కి కూడా పడదు. మరి సిద్ధాంతాల పరంగా చాలా వ్యత్యాసం ఉన్న ఈ పార్టీలు.. ఎలా ఒక్కటి అవుతారు? అన్నది వేచిచూడాలి.