భారత్ జోడో న్యాయ్ యాత్ర: వీలైనన్ని కేసులు పెట్టండి.. రాహుల్ గాంధీ సవాల్
వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టాలని రాహుల్ గాంధీ అస్సాం పోలీసులకు సవాల్ విసిరారు. అస్సాం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టాలని బీజేపీ-ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీ పాలిత ఈశాన్య రాష్ట్రం 'అస్సాం'లో వీలైనన్ని కేసులు పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. గువాహటి పోలీసులు తనపై, ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బార్ పేట జిల్లాలో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 7వ రోజు తన తొలి బహిరంగ సభలో ప్రసంగించిన కాంగ్రెస్ నేత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
1) "కేసులు పెట్టి నన్ను భయపెట్టవచ్చనే ఆలోచన హిమంత బిశ్వ శర్మకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టండి. మరో 25 కేసులు పెట్టండి. నన్ను భయపెట్టలేరు. బీజేపీ-ఆరెస్సెస్ నన్ను భయపెట్టలేవు..’
2) ‘‘అస్సాం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టేయాలని బీజేపీ-ఆరెస్సెస్ చూస్తున్నాయి. వారు అస్సాంను నాగపూర్ నుండి నడపాలని అనుకుంటున్నారు. కానీ మేం దానిని అనుమతించం..’
3) "మీ దగ్గర పాన్ (తమలపాకులు) ఉన్నా సుపారీ వ్యాపారం అతనిదే... సాయంత్రానికి పాన్ తింటే అది ముఖ్యమంత్రిదేనని తెలిసిపోతుంది. అతను మీ జేబు కత్తిరిస్తాడు. ఆయన పని ఇదే. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి ఆయన..’’
4) 'మీ ముఖ్యమంత్రి 24 గంటలూ భయాన్ని, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు. కానీ అక్కడితో ఆగడం లేదు. ముఖ్యమంత్రి మీ భూమిని దొంగిలిస్తున్నారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి ఆయన..’’
5) 'అసోం ముఖ్యమంత్రి పగ్గాలు అమిత్ షా చేతిలో ఉన్నాయి. అమిత్ షాకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడే సాహసం చేస్తే రెండు నిమిషాల్లో ఆయనను పార్టీ నుంచి గెంటివేస్తారు..’ (ఏజెన్సీల సమాచారంతో)