Akhilesh Yadav : 'ఇండియా' కూటమి నుంచి అఖిలేశ్ యాదవ్ ఔట్?
20 October 2023, 6:06 IST
- Akhilesh Yadav : ఇండియా కూటమి నుంచి అఖిలేశ్ యాదవ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఇందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం!
'ఇండియా' బృందం నుంచి అఖిలేష్ యాదవ్ ఔట్?
Akhilesh Yadav India alliance : 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న 'ఇండియా' కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి! దేశంలోని కీలక విపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ.. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కారణం గమనార్హం. అసలేం జరిగిందంటే..
కాంగ్రెస్‌పై సీరియస్..
2024 లోక్‌సభ ఎన్నికల కోసం దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఒక్కటై.. 'ఇండియా'గా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే.. కూటమిని ఏర్పాటు చేసినంత ఈజీగా.. విజయం దక్కదని రాజకీయ నిపుణులు చెబుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా సీట్ల షేరింగ్ విషయంలో తలనొప్పులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందే.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ మధ్య విభేదాలు మొదలయ్యాయి!
Akhilesh Yadav latest news : త్వరలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో మధ్యప్రదేశ్ కూడా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోను కాస్త పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో.. తాము బలంగా ఉన్న స్థానాల్లో బరిలో దిగుతామని, కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఆ మాటలను కాంగ్రెస్ పట్టించుకోలేదు! ఫలితంగా.. ఇప్పుడు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకున్న పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై గురువారం మీడియాతో మాట్లాడారు ఎస్పీ అధినేత. కాంగ్రెస్‌పై తన అసహనాన్ని బయటపెట్టారు.
"మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌తో మాట్లాడాను. మధ్యప్రదేశ్‌లో మా పార్టీ ప్రదర్శన గురించి వివరించాను. గతంలో మా ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారు? ఎక్కడ నెంబర్.2గా నిలిచారో చెప్పాను. మాకు 6 సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇక అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎస్పీ ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో కూటమి లేదని నాకు ముందే తెలిస్తే.. అసలు కలిసేవాడినే కాదు కదా! కాంగ్రెస్‌తో మాట్లాడే వాడినే కాదు కదా!" అని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
Madhya Pradesh Assembly elections 2023 : ఎస్పీ అధినేత మాటలకు ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కౌంటర్లు వేయడంతో పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి.
"మధ్యప్రదేశ్‌లో ఎస్పీకి అసలు ప్రభావమే లేదు. అక్కడ ఆ పార్టీ పోటీచేయకూడదు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని లోక్‌సభ సీట్లల్లో (80) పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది," అని అజయ్ రాయ్ అన్నారు.
ఈ మాటలను అఖిలేశ్ యాదవ్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కాంగ్రెస్‌పై మాటల దాడి చేశారు.
Congress vs Samajwadi Party : "కాంగ్రెస్‌లోని చిన్నచిన్న నేతలు ఎస్పీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలోని వారు.. బీజేపీతో ఉన్నారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు లేవని తెలిస్తే.. మా నేతలను మధ్యప్రదేశ్‌కు పంపే వాడినే కాదు. కాంగ్రెస్.. ఇతర పార్టీలను దారుణంగా చూస్తోంది. ఇండియ కూటమిలో ఉండేందుకు పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది," అని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో.. కాంగ్రెస్- ఎస్పీ ఇలా ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకోవడం.. బీజేపీకే మంచిది! వీరి మధ్య ఓట్లు చీలితే.. బీజేపీకి గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి.