TS Congress : కాంగ్రెస్ అధికారంలో వస్తే రూ.2 లక్షల రైతు రుణమాఫీ- ప్రియాంక గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరకడంలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ములుగులో కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ప్రారంభించిన ప్రియాంక, రాహుల్… అనంతరం నిర్వహించిన బహిరంగ సభ పాల్గొన్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసిందన్నారు. మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు విలువ ఇచ్చిందన్నారు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారన్నారు. రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతి ఏకరాకు రైతుకు రూ.15 వేలు ఇస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్
'ములుగు జిల్లా పుణ్యభూమి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం చాలా మంది పోరాటం చేశారు. తెలంగాణ ప్రగతి కోసం ప్రజలు కలలు కన్నారు. సామాజిక న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీని నమ్మారు. కానీ మీ నమ్మకాన్ని బీఆర్ఎస్ వమ్ము చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆంక్షలు నెరవేస్తుంది. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సోనియా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అంబేడ్కర్ భరోసా కింద ఎస్టీ, ఎస్సీలకు రూ.12 లక్షలు ఇస్తాం. ఇందిరమ్మ పథకం కింద స్థలంతో పాటు రూ. 6 లక్షలు ఇస్తాం. ఆదివాసీ గ్రామపంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు కేటాయిస్తాం'- ప్రియాంక గాంధీ
తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్
బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తెలంగాణకు ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించిందన్నారు. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రియాంక గాంధీ అన్నారు.
అంతకు ముందు రామప్ప దేవాలయాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే దర్శించుకున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించారు.