I.N.D.I.A: లోక్ సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం: విపక్ష కూటమి; వివిధ కమిటీల ఏర్పాటు
I.N.D.I.A: ముంబైలో జరుగుతున్న విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేస్తామని ఈ భేటీలో విపక్ష నేతలు ఒక తీర్మానం చేశారు.
I.N.D.I.A: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని బీజేపీని ఓడించడం లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ‘ఇండియా (I.N.D.I.A)’ నేతలు ముంబైలో సమావేశమయ్యారు. గురువారం ప్రారంభమైన ఈ సమావేశం శుక్రవారం కూడా కొనసాగుతోంది. ఈ సమావేశాల్లో విపక్ష కూటమి నేతలు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
కలిసే పోటీ..
రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేస్తామని ఈ భేటీలో విపక్ష నేతలు ఒక తీర్మానం చేశారు. ఆయా రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ కు సంబంధించి చర్చలు వెంటనే ప్రారంభించాలని, సీట్ల పంపకం విషయంలో పట్టువిడుపులతో, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని నిర్ణయించారు. జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న వార్తల నేపథ్యంలో విపక్ష కూటమి వేగం పెంచింది.
సమన్వయ కమిటీ..
ఈ సమావేశాల్లోనే 13 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీ (coordination committee) ని కూడా విపక్ష కూటమి ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీతో పాటు 20 మంది సభ్యులతో ప్రచార కమిటీని, 12 మంది సభ్యులతో సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ ను, 11 మంది సభ్యులతో రీసెర్చ్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ముంబైలో జరుగుతున్న సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీయేతర 28 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్ని కేంద్రం ఆలోచనను విపక్ష కూటమి తీవ్రంగా ఖండించింది. అలాగే, చంద్రయాన్ 3 విజయాన్ని స్వాగతిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
పాల్గొన్న నాయకులు..
ఈ సమావేశాల్లో కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, నితీశ్ కుమార్ (జేడీయూ), శరద్ పవార్ (ఎన్సీపీ), మమత బెనర్జీ (టీఎంసీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఫారూఖ్ అబ్దుల్లా (ఎన్సీ), మొహబూబా ముఫ్తీ (పీడీపీ), వామపక్షాలు, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.