TS Congress MP Applications : లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్, ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరణ
TS Congress MP Applications : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ అప్లికేషన్లు ఆహ్వానించింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
TS Congress MP Applications : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. నేటి నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ,దివ్యంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 25 వేలుగా నిర్ణయించింది. ఇక మిగిలిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 50,000గా పార్టీ నిర్ణయించింది. అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలని అభ్యర్థులకు పార్టీ సూచించింది. దరఖాస్తు ఫార్మ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని గాంధీ భవాన్ సిబ్బంది ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబించింది. ఇప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తోంది. తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి 2019 ఎన్నికలో మల్కాజిగిరి నుంచి....నల్గొండ నుంచి ఉత్తమ కుమార్ రెడ్డి, అలాగే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నాలుగు సీట్లు దక్కించుకుంది. కాగా ఈసారి లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆశావహుల ముందు 17 డిక్లరేషన్లను పెట్టిన పార్టీ
అప్లికేషన్ ఫామ్ లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల ముందు పార్టీ 17 డిక్లరేషన్ లను పెట్టింది. "పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించని పక్షంలో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయనని డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే నేను కట్నం తీసుకోను, ఇవ్వను అని, హింసకు తావివ్వకుండా, స్త్రీల గౌరవాన్ని నిలబెడతానని పార్టీ ప్రోటోకాల్ పాటించడంతో పాటు మత, కుల రాజకీయ సంస్థలతో అనుబంధం కలిగి ఉండనని, కులమత భావాలను ప్రోత్సహించే ఇలాంటి సమావేశాలకు హాజరుకానని డిక్లరేషన్ ఇవ్వాలని అభ్యర్థులను కోరింది. ఏ క్రిమినల్ ఎలిమెంట్ తోనూ ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండనని, ఎన్నికల తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో ఆస్తి రిటర్న్ లు, ప్రతి సంవత్సరం ఆస్తులు వివరాలను సమర్పిస్తానని తదితర అంశాలపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. అలాగే ఏఐసీసీ, వర్కింగ్ కమిటీ లేదా సెంట్రల్ పార్లమెంట్ బోర్డు ద్వారా నిర్దేశించిన ఆదేశాలను అనుసరించడంతో పాటు పార్టీ జారీ చేసే విప్ లను పాటిస్తానని సంతకంతో ప్రతిజ్ఞ చేస్తున్నట్లు సంతకం చేసి అప్లికేషన్ ఇవ్వాలని ఆశావహులను కోరింది.
ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్ గా మారింది. గతంలో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులుగా పాల్గొన్నారు. ప్రస్తుతం మరోసారి ఇంద్రవెల్లి సభకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దళిత గిరిజన దండోరా కార్యక్రమం విజయవంతమైన విషయం తెలిసిందే. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్ గా భావించి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో, డీసీసీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి సభకు స్థానిక ఎమ్మెల్యే వెడల్ బుజ్జి పటేల్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, హరిరావు మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు సీఎం సభను పకడ్బందీగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో దళిత గిరిజన దండోరా ఏ విధంగా సక్సెస్ అయిందో అదే విధంగా ఇప్పుడు కూడా సక్సెస్ చేయాలని మండల స్థాయిలోని నాయకులకు ఆదేశించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం