Chevella MP Ticket 2024 : చేవెళ్ల ఎంపీ టికెట్ - బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ కసరత్తు
Chevella LokSabha constituency News: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చి సరికొత్త జోష్ తో ఉన్న ఆ పార్టీ నాయకత్వం… అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. కీలకమైన చెవేళ్ల స్థానం నుంచి బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు చేస్తోంది.
Chevella Congress MP Ticket 2024 : త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలను పూర్తి చేసుకుంది.ఇటు బిజెపి కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతూ..... ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై పార్టీ శ్రేణుల నుండి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం.రంగారెడ్డి జిల్లా లోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని బరిలో దింపితే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.చేవెల్ ఎంపీ సీటును ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటినుండే ఆ దశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ,బిఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీగా నిలిచే నాయకుడి కోసం కాంగ్రెస్ పార్టీ వెతికే పనిలో పడింది.కాగా గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు హస్తం నేతలు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రణాళిక రచిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అభ్యర్థుల రేసులో వీరు........
అయితే పార్లమెంట్ స్థానల నుంచి పోటీ చేసేందుకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపుతున్నారు.చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి తమ అభ్యర్థనలను ఉంచినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ టికెట్ తమకే కేటాయిస్తారన్న నమ్మకంతో పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు వాల్ పోస్టర్స్ సైతం వేసే పనిలో పడ్డారు. వారిలో ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్కె లక్ష్మారెడ్డి, టిపిసిసి ప్రతినిధి సత్యంరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.అయితే ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో సత్యం రావును చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నిలపాలని ప్రతిపాదిస్తూ జిల్లా నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సత్యంరావు అయితే అన్ని రకాలుగా బాగుంటుందని ,గత మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ప్రజలకు,కేడర్ కు అందుబాటులో ఉంటున్నారని అయన అనుచరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నాకు సమయం కావాలి : కాంగ్రెస్ నేత సత్యం రావు
ఇదిలా ఉంటే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి సత్యంరావు పేరుని పార్టీ శ్రేణులు ప్రతిపాదించిన...... ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమంలో నుండి తనకు మూడు నెలలు విరామం కావాలంటూ టిపిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఆయన అభ్యర్థనను పార్టీ పెద్దలు పునరాలోచిన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని,అయన మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నట్లు ఇంకొందరు అంటున్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేర్ లింగంపల్లి నుంచి టికెట్ ఆశించి సత్యం రావు భంగ పడ్డారు.ఏది ఏమైనా ఈసారి చేవెళ్ల పార్లమెంట్ స్థానం లో కాంగ్రెస్ జెండా ఎగరవేయలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.
సంబంధిత కథనం