Mamata Banerjee: ఒంటరిగానే పోటీ అన్న మమత ప్రకటనతో.. ‘ఇండియా’ కూటమిలో ప్రకంపనలు; కూటమిలో సీపీఎం తీరుపై మమత అసంతృప్తి
24 January 2024, 13:51 IST
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లో లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చేసిన ప్రకటనతో.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’కు తొలి దెబ్బ తగిలింది.
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ
Mamata Banerjee: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ఒంటరిగానే పోటీ చేయాలని మమత బెనర్జీ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ సీట్లలో కేవలం 2 సీట్లను మాత్రమే కాంగ్రెస్ కు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించడం కాంగ్రెస్ ను ఆగ్రహానికి గురి చేసింది. దాంతో, మమత అవకాశవాది, అని ఆమె దయాదాక్షిణ్యాలు కాంగ్రెస్ కు అవసరం లేదని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండి పడ్డారు.
కూటమికి ఇండియా అనే పేరు పెట్టిందే నేను
విపక్ష కూటమికి ‘ఇండియా ’ అనే పేరును ప్రతిపాదించింది తానేనని మమత బెనర్జీ వెల్లడించారు. ‘‘కూటమికి ఇండియా అనే పేరు పెట్టిందే నేను. కానీ కూటమి సమావేశాలకు నేను హాజరైన ప్రతీ సారి.. రాష్ట్రంలో మాకు వ్యతిరేకంగా ఉన్న సీపీఎం ఆ సమావేశాన్ని నియంత్రిస్తోంది. అది నన్ను అవమానించినట్లుగా అనిపిస్తుంది. సీపీఎం పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న 34 ఏళ్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాము. వారి సలహా పాటించే ప్రసక్తే లేదు’’ అని మమత బెనర్జీ స్పష్టం చేశారు.
ఇండియా కూటమి పరిస్థితి
సీట్ల పంపకానికి సంబంధించిన చర్చల్లో కాంగ్రెస్ తీరు సరిగ్గా లేదని మమత బెనర్జీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ సీట్లలో 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని తాను ప్రతిపాదించానన్నారు. తన ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకారం తెలపలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము రాష్ట్రంలో ఉన్నఅన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు తాము ఇస్తామని చెప్పిన రెండు స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రియాక్షన్
బీజేపీ ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 23 విపక్ష పార్టీలు ఒక్కటై ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్లో అన్ని సీట్లలో తామే పోటీ చేస్తామని మమత విస్పష్టంగా ప్రకటించడం ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మమత ప్రకటనపై ఇప్పటివరకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటివరకు ఏ ప్రకటన రాలేదు. కానీ, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మాత్రం మమతపై విమర్శలు గుప్పించారు. ఆమె అవకాశవాది అని, ఆమె దయాదాక్షిణ్యాలు కాంగ్రెస్ కు అవసరం లేదని ఆయన మండి పడ్డారు.
రాహుల్ గాంధీ కామెంట్స్..
కాగా, పశ్చిమ బెంగాల్లో తామే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మమత ప్రకటించడానికి ముందు రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ తనకు, తన పార్టీకి ఎంతో దగ్గరి వారని ఆయన వ్యాఖ్యానించారు. టీఎంసీతో సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకుల మాటలను పట్టించుకోవద్దన్నారు. రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే, సీట్ల పంపకంపై కాంగ్రెస్ తో చర్చలు విఫలమయ్యాయని మమత ప్రకటించడం విశేషం.
భారత్ జోడో న్యాయ యాత్ర
కాగా, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర త్వరలో పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో, ఆ యాత్రలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పాల్గొంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రశ్నించగా.. భారత్ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్ లోకి వస్తోందన్న విషయమే తనకు తెలియదని, ఆ విషయం కాంగ్రెస్ నాయకులు తమకు తెలియజేయలేదని మమత సమాధానమిచ్చారు. అంటే, యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని ఆమె పరోక్షంగా సమాధానమిచ్చారు.