Cyclone Gabrielle : 'గాబ్రియెల్' ఎఫెక్ట్.. అంధకారంలో న్యూజిలాండ్!
13 February 2023, 8:03 IST
New Zealand Cyclone Gabrielle : న్యూజిలాండ్‌వైపు గ్రాబియెల్ తుపాను దూసుకెళుతోంది. కొన్ని రోజుల క్రితమే రికార్డు స్థాయి వరదలతో అల్లాడిపోయిన ప్రజలు.. ఇప్పుడు ఈ వార్తతో భయాందోళనకు గురవుతున్నారు.
తుపాను కారణంగా.. తీరం వద్ద ఎగిసిపడుతున్న కెరటాలు
New Zealand Cyclone Gabrielle latest news : వరుసగా వచ్చి పడుతున్న ప్రకృతి విపత్తులతో న్యూజిలాండ్ వణికిపోతోంది. భారీ వరదలతో ఇటీవల కుదేలైన ఆ ప్రాంతం ముంగిట ఇప్పుడు పెను తుపాను నిలబడింది! గాబ్రియెల్ తుపాను ధాటికి ఇప్పటికే 58వేల నివాసాలు అంధకారంలోకి జారుకున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గాబ్రియెల్ ఎఫెక్ట్..
ప్రస్తుతం.. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఈ గాబ్రియెల్ తుపాను కేంద్రీకృతమై ఉంది. సోమవారం- మంగళవారం ఇది తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ ప్రజలను హెచ్చరించింది.
Cyclone Gabrielle live updates : "గాబ్రియెల్ తుపాను ప్రభావం ఇంకా తక్కువగానే ఉంది. మరికొన్ని గంటల్లో తీవ్రత పెరగొచ్చు. సోమవారం అర్ధరాత్రి- మంగళవారం తెల్లవారుజామున తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు," అని ఆక్లాండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ పేర్కొంది.
న్యూజిలాండ్‌లోని అప్పర్ నార్త్ ఐల్యాండ్‌తో పాటు ఆక్లాండ్‌లోని అనేక స్కూళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకపోవడం సురక్షితమని ఆదేశాలు జారీ అయ్యాయి. అక్లాండ్‌తో పాటు నాలుగు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది అక్కడి ప్రభుత్వం.
తుపాను కారణంగా రవాణా వ్యవస్థకు నష్టం జరిగిందని తెలుస్తోంది. పలు విమానాలు, బస్సులు, ఫెర్రీల రాకపోకలు నిలిచిపోయినట్టు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టుు సమాచారం.
రికార్డు స్థాయిలో వరదలు..
New Zealand floods 2023 : గత నెలలో వరదలు సృష్టించిన బీభత్సానికి.. ఆక్లాండ్‌తో పాటు పరిసర ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. కొన్ని వారాల క్రితమే.. భారీ వర్షాలతో ఆక్లాండ్ అతలాకుతలమైంది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇక ఇప్పుడు తుపాను వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.