Doctor rape case: సీబీఐకి కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు; కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
13 August 2024, 18:57 IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన
కోల్ కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని, స్థానిక పోలీసులు తక్షణమే కేసును సీబీఐకి అప్పగించాని ఆదేశించింది. ఆలస్యం చేస్తే, సాక్ష్యాధారాలు నాశనం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
సీబీఐకి కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసు
కోల్ కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లను వెంటనే సీబీఐకి అప్పగించాలని కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. ఆలస్యం చేస్తే, సాక్ష్యాధారాలు నాశనం చేసే అవకాశం ఉందని, వెంటనే కేసును సీబీఐకి బదిలీ చేయాలని స్పష్టం చేసింది.
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఆసుపత్రి ప్రాంగణంలో మహిళా డాక్టర్ ను దారుణంగా అత్యాచారం చేసి, ఆ తరువాత చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా, ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘సాధారణ పరిస్థితుల్లో కోర్టు కొంత సమయం ఇచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్న కేసు అసాధారణమైనది. ఇప్పటికే ఈ కేసులో కొంత పురోగతి రావాల్సి ఉంది. దర్యాప్తు అధికారులు ఒక కంక్లూజన్ ను రావాల్సి ఉంది.కానీ, అలా జరగలేదు. ఐదు రోజుల తర్వాత కూడా, ముఖ్యమైన నిర్ధారణలు ఏవీ లేవు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సాక్ష్యాధారాలు నాశనం చేసే అవకాశం
ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో ఇంకా ఆలస్యం చేస్తే, సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఇంకా ఆలస్యం చేస్తే, సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉందనే వాదనను మేం సమర్థిస్తున్నాం. ఈ కేసును తక్షణమే సీబీఐ (CBI) కి బదిలీ చేయడం సముచితమని భావిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. కేసు డైరీ, ఇతర రికార్డులను ఆగస్టు 14 బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి బదిలీ చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. నివేదిక, సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను ఆదేశిస్తున్నామని, అన్నీ రికార్డు చేసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
దారుణంగా హత్యాచారం
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని సెమినల్ హాల్ లో శుక్రవారం ఉదయం ఓ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. దీనికి సంబంధించి ఓ మున్సిపల్ వాలంటీర్ ను శనివారం అరెస్టు చేశారు. ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని కోరుతూ బాధిత పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ పలు పిల్ లు కూడా దాఖలయ్యాయి. రాష్ట్ర పోలీసులు విచారణ జరిపేందుకు అనుమతిస్తే దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందని బాధితురాలి తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, హైకోర్టు తీర్పును నిరసనకారులు స్వాగతించారు.