Puja Khedkar arrest : ‘పూజా ఖేడ్కర్‌ని ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?’- దిల్లీ హైకోర్టు
Puja Khedkar Delhi High Court : పూజా ఖేడ్కర్‌ను తక్షణ కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి కనిపించడం లేదని జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ అన్నారు. ఆగస్ట్ 21 వరకు ఆమెను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలిచ్చారు.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఊరట! ఆగస్టు 21 వరకు ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా ప్రొబేషనరీలో ఉన్న ఖేడ్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జులై 31న రద్దు చేసిన విషయం తెలిసిందే.
పూజా ఖేడ్కర్‌ని ఎందుకు అరెస్ట్ చేయాలి?
కుట్రను వెలికి తీయడానికి పూజా ఖేడ్కర్ కస్టడీ ఎందుకు అవసరమో సమాధానం ఇవ్వాలని దిల్లీ పోలీసులకు, యూపీఎస్సీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఖేడ్కర్‌ను తక్షణ కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి తనకు కనిపించడం లేదని జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ అన్నారు.
“అప్లికేషన్ ఫామ్‌లో తప్పుగా వివరాలిచ్చారన్న విషయంపై ఈ కేసు ఉంది. ఆమె పేరు, తండ్రి పేరు మీద సమస్య ఉంది. కానీ ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కనిపించం లేదు. ఆమె ఒక్కరే చేశారా? లేక ఇతరులు కూడా ఇందులో పాల్గొన్నారా? థర్డ్ పార్టీ కూడా ఉంట, కుట్రను బయటపెట్టాలి,” అని జస్టిస్ ప్రసాద్ యూపీఎస్సీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నరేష్ కౌషిక్‌తో అన్నారు.
“ఆమె ఇతరుల సహాయం ఎక్కడి నుంచి తీసుకున్నారనేది ప్రశ్న. ఆమె వ్యవస్థలో లేదు. వ్యవస్థను తారుమారు చేయాలంటే ఆమె వ్యవస్థలో ఉండాలి. నేరం ఒంటరిగా జరిగింది. కానీ బెయిల్ ఇవ్వకపోవడానికి అది ఒక కారణమా?” దిల్లీ పోలీసులు, నరేశ్ కౌశిక్‌కి జస్టిస్ ప్రసాద్ తెలిపారు.
ఆమె కోరిన బెయిల్ ఎందుకు ఇవ్వలేదనే దానిపై ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఎటువంటి చర్చ జరగలేదని జస్టిస్ గుర్తించారు.
ప్రస్తుత కేసు వాస్తవాల దృష్ట్యా తదుపరి విచారణ తేదీ (ఆగస్టు 21) వరకు పిటిషనర్‌ని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
తనకు ముందస్తు బెయిల్ నిరాకరించిన జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పూజా ఖేడ్కర్ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహించే యూపీఎస్సీ పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి తన గుర్తింపును ఫేక్ చేసిందని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో అదనపు ప్రయత్నాల కోసం గుర్తింపును తారుమారు చేసినందుకు ఆమెపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, సమగ్ర దర్యాప్తు అవసరమని దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు గతంలో గుర్తించింది.
కుట్రను వెలికి తీయడానికి, కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడానికి నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి అన్నారు.
యూపీఎస్సీ గత నెలలో పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సైతం సవాలు చేస్తూ తగిన వేదికను ఆశ్రయించే స్వేచ్ఛను ఇటీవల దిల్లీ హైకోర్టు ఆమెకు కల్పించింది.
సంబంధిత కథనం