Puja Khedkar : పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ నిషేధం.. భవిష్యత్తులో ఏ పరీక్షలూ రాయకుండా చర్యలు
Puja Khedkar : ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం చేసిన దరఖాస్తులో అవకతవకలకు పాల్పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షకూ హాజరు కాకుండా నిషేధం విధించారు. UPSC అందుబాటులో ఉన్న పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు పూజా దోషిగా తేలింది. ఇకపై అన్ని పరీక్షలు రాయకుండా నిషేధం విధించినట్లు యూపీఎస్సీ తెలిపింది.
యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా లెవల్ లో 821 ర్యాంక్ సాధించిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్ష వచ్చేందుకు మోసపూరితంగా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై షోకాజ్ నోటీసులు కూడా పంపారు. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో చర్యలు తీసుకున్నారు.
పూజా ఖేద్కర్ కేసు నేపథ్యంలో UPSC 2009 నుండి 2023 వరకు అంటే 15 సంవత్సరాలకు సంబంధించి అభ్యర్థులను సిఫార్సు చేసిన 15,000 కంటే ఎక్కువ సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్ అందుబాటులో ఉన్న డేటాను క్షుణ్ణంగా సమీక్షించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు యూపీఎస్సీ మరింత బలోపేతం చేసే ప్రక్రియలో ఉంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె తన పేరు, తన తండ్రి, తల్లి పేర్లు, ఆమె ఫోటో/సంతకం, ఇమెయిల్ ఐడి, చిరునామా, మొబైల్ నంబర్‌ను మార్చడం ద్వారా తన గుర్తింపును నకిలీ చేసి పరీక్షా నిబంధనల ప్రకారం మోసపూరిత ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు UPSC ఒక ప్రకటనలో తెలిపింది.
ఆమె తన శారీరక వైకల్యాన్ని నిరూపించుకోవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో UPSC ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)కి ఆమెను తిరిగి పిలిచారు, శిక్షణను నిలిపివేశారు. కానీ ఆమె అక్కడకు వెళ్లలేదు.
మరోవైపు పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు ఆగస్టు 1న విచారణ చేపట్టనుంది. ఈ కేసును మంగళవారం విచారించాల్సిన అదనపు సెషన్స్ జడ్జి దేవేంద్ర కుమార్ జంగాలా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పిపి) సమయం కోరడంతో విచారణను వాయిదా వేశారు.
భూ వివాదానికి సంబంధించిన క్రిమినల్ కేసులో పూజా ఖేద్కర్ తల్లిని ఇటీవలే పూణె కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. భూ వివాదానికి సంబంధించి కొందరిని తుపాకీతో బెదిరించినందుకు గానూ మనోరమ ఖేద్కర్‌ను పూణె జిల్లాలో అరెస్టు చేశారు.