Kavitha Bail Petition: కవితకు మధ్యంతర బెయిల్‌కు సుప్రీం కోర్టు నిరాకరణ, 20వ తేదీకి విచారణ వాయిదా
Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ, ఈడీల స్పందన తెలపాలని ఆదేశించిన సుప్రీంకోర్టు విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది.
Kavitha Bail Petition: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. లిక్కర్ పాలసీలో నమోదైన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ నాయకురాలు కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. గత ఐదు నెలలుగా జైల్లో ఉంటున్న కవిత మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కవిత తకరపున ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత అభ్యర్థనపై సీబీఐ, ఈడీల స్పందన తెలపాలని సుప్రీం కోర్టు కోరింది.
ఈ కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 20కి వాయిదా వేసింది.
ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో కవిత ప్రధాన కుట్రదారు అని పేర్కొంటూ హైకోర్టు జూలై 1 న రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్ కు సంబంధించి ఈ కేసు నమోదైంది. గత మార్చిలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కవిత ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ ఏప్రిల్ 11న ఆమెను అరెస్టు చేసింది.sa