Beef ban in Assam: రాష్ట్రంలో బీఫ్ తినడంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
04 December 2024, 20:15 IST
Beef ban in Assam: గొడ్డు మాంసం వినియోగంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో దేవాలయాల సమీపంలో గొడ్డు మాంసం విక్రయాలను, వినియోగాన్ని అస్సాం ప్రభుత్వం నిషేధించింది. తాజాగా, ఆ నిషేధాన్ని మరింత విస్తరిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.
రాష్ట్రంలో బీఫ్ తినడంపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం
Beef ban in Assam: అసోంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం విక్రయించడాన్ని, వినియోగించడాన్ని నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం ప్రకటించారు. ఏ హోటల్ లేదా రెస్టారెంట్ లేదా ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ లేదా పబ్లిక్ ప్లేస్ లో గొడ్డు మాంసం వినియోగం నిషిద్ధమని స్పష్టం చేశారు.
పబ్లిక్ ప్లేసెస్ లో కూడా..
‘‘అస్సాంలో ఏ రెస్టారెంట్, హోటల్లో బీఫ్ వినియోగించకూడదని, పబ్లిక్ ఫంక్షన్లు, పబ్లిక్ ప్లేస్ లలో బీఫ్ ను వడ్డించరాదని నిర్ణయించాం. కాబట్టి, ఈ రోజు నుండి, హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలలో గొడ్డు మాంసం వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మేము నిర్ణయించుకున్నాము’’ అని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
దేవాలయాల సమీపంలో..
దేవాలయాల దగ్గర గొడ్డు మాంసం తినడాన్ని నిలిపివేయాలని గతంలోనే అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్రమంతటికి విస్తరించామని, కమ్యూనిటీ ప్లేస్, పబ్లిక్ ప్లేస్, హోటల్, రెస్టారెంట్లలో బీఫ్ వినియోగాన్ని నిషేధించామని, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని శర్మ తెలిపారు. బీఫ్ బ్యాన్ ను స్వాగతించాలని, లేదంటే పాకిస్థాన్ వెళ్లి స్థిరపడాలని అస్సాం కాంగ్రెస్ కు సవాల్ విసురుతున్నట్లు అస్సాం మంత్రి పిజుష్ హజారికా తెలిపారు. అస్సాంలో బీఫ్ ను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా లేఖ రాస్తే తాను సిద్ధంగా ఉన్నానని శర్మ కొద్ది రోజుల క్రితం చెప్పారు.
బీఫ్ పై రాజకీయాలు
వరుసగా ఐదు పర్యాయాలుగా కాంగ్రెస్ గెలుస్తున్న సమగురిలో గెలిచేందుకు బీజేపీ బీఫ్ పంపిణీ చేసిందన్న ఆరోపణపై శర్మ స్పందిస్తూ.. ‘‘సమగురి 25 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుస్తోంది. సమగురి లాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ 27 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆ పార్టీ చరిత్రలోనే అతి పెద్ద అవమానం. ఇది బీజేపీ గెలుపు కంటే కాంగ్రెస్ ఓటమి’’ అని ఆయన శనివారం పార్టీ సమావేశం అనంతరం విలేకరులతో అన్నారు. గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీప్లు రంజన్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి తాంజిల్ పై 24,501 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓటర్లకు బీఫ్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ సమగురిలో గెలుస్తుందా అని ప్రశ్నించారు. అస్సాం పశు సంరక్షణ చట్టం 2021 ప్రకారం హిందువులు, జైనులు, సిక్కులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో, ఆలయం లేదా సత్ర (వైష్ణవ మఠం) కు ఐదు కిలోమీటర్ల పరిధిలో పశువుల వధ మరియు గొడ్డు మాంసం అమ్మకాలను అస్సాం ప్రభుత్వం గతంలో నిషేధించింది.