Savarkar: ‘‘సావర్కర్ బీఫ్ తినేవాడు.. గోవధకు ఆయన వ్యతిరేకం కాదు’’: కాంగ్రెస్ నేత కామెంట్స్
వీర్ సావర్కర్ పై కర్నాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. సావర్కర్ ను అవమానించడం అంటే ఆకాశంలోని చంద్రుడిపై ఉమ్మి వేయడం వంటిదని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ నేతపై పరువునష్టం దావా వేస్తామని సావర్కర్ వారసులు హెచ్చరించారు.
హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ పై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గురువారం రాజకీయ దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలను శివసేన, భారతీయ జనతా పార్టీ ఖండించాయి. ఇవి స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్ ను అవమానించడమేనని పేర్కొన్నాయి.
సావర్కర్ బీఫ్ తినేవాడు..
వీర్ సావర్కర్ బ్రాహ్మణుడైనప్పటికీ గొడ్డు మాంసం తినేవాడని, ఆయన గోవధకు వ్యతిరేకం కాదని బుధవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ ధీరేంద్ర కె ఝా రాసిన ‘‘ది గాంధీస్ అసాసిన్: మేకింగ్ ఆఫ్ నాథూరాం గాడ్స్ అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా’’ అనే పుస్తకం కన్నడ అనువాదాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో గుండూరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సావర్కర్ చిత్పవన్ బ్రాహ్మణుడు. ఆయన మాంసం తినేవాడు. సావర్కర్ గో వధకు వ్యతిరేకం కాదు. ఆయన ఒకరకంగా ఆధునికుడు. ఆధునిక భావాలున్నాయి కనుకే తాను మాంసం తినడమే కాకుండా, బ్రాహ్మణుడినైన తాను మాంసం తింటున్నాను అని బహిరంగంగా చెప్పుకునేవాడు. సావర్కర్ గొడ్డుమాంసం కూడా తినేవాడని కొందరు అంటుంటారు’’ అని గుండూరావు వ్యాఖ్యానించారు.
బీజేపీ, శివసేన ఆగ్రహం
దీనిపై ఇప్పుడు రాజకీయ దుమారం ప్రారంభమైంది. గుండూరావు వ్యాఖ్యలను శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్రంగా ఖండించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో సావర్కర్ ది గణనీయ పాత్ర అని, మహారాష్ట్రలో చాలా మంది ఆయనను ఆరాధిస్తారని, అటువంటి సావర్కర్ ను అవమానించవద్దని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.
చంద్రుడిపై ఉమ్మి వేయడం..
సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ (bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. గుండూరావు వ్యాఖ్యలు దురదృష్టకరమని, అవమానకరమని, అత్యంత ఖండించదగినవని చుగ్ అభివర్ణించారు. దేశంలోని విప్లవకారులకు స్ఫూర్తిగా నిలిచిన వీర్ సావర్కర్ ను అవమానించడం చంద్రుడిపై ఉమ్మివేయడంతో సమానమని చుగ్ అన్నారు.
పరువు నష్టం దావా వేస్తాం: సావర్కర్ కుటుంబం
తన తాతను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వీర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ ఆరోపించారు. హిందూ సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది బ్రిటిష్ వలసవాద కాలం నాటి విధానాలను గుర్తు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా ఎన్నికల సమయంలో సావర్కర్ ను పదేపదే అప్రతిష్టపాలు చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం. గతంలో రాహుల్ గాంధీ (rahul gandhi) ఆ పని చేశారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని చూపించింది’’ అని రంజిత్ సావర్కర్ అన్నారు. సావర్కర్ గొడ్డు మాంసం తిన్నారని కర్నాటక మంత్రి గుండూ రావు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అవి "అవాస్తవం" అని స్పష్టం చేశారు. కర్నాటక మంత్రి గుండూరావు పై పరువు నష్టం దావా వేస్తానని బెదిరించారు.