Siddaramaiah: ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు-lokayukta registers fir against karnataka cm siddaramaiah in muda case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Siddaramaiah: ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు

Siddaramaiah: ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు

Sudarshan V HT Telugu
Sep 27, 2024 05:47 PM IST

Siddaramaiah: ముడా స్థల కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతినివ్వడాన్ని కర్నాటక హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో, ముడా కుంభకోణంలో లోకాయుక్త విచారణ ప్రారంభమైంది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Siddaramaiah: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థల కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా రూ.56 కోట్ల విలువైన 14 స్థలాలను కేటాయించడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. సిద్ధరామయ్య (CM Siddaramaiah) పై విచారణ జరిపించాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు లోకాయుక్తను ఆదేశించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

హైకోర్టు ఆదేశాలతో..

ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించాలని మైసూరులోని లోకాయుక్త పోలీసులను ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక కోర్టు మాజీ ఎంపీలు/ ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారిస్తుంది. ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని కర్నాటక హైకోర్టు సమర్థించింది.

గవర్నర్ అనుమతితో..

సాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని, అయితే అసాధారణ పరిస్థితుల్లో గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చని, ప్రస్తుత కేసు అలాంటి మినహాయింపును సూచిస్తోందని జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సెప్టెంబర్ 24న తీర్పు వెలువరించింది.