Hijab Row | హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు
కర్ణాటకతోపాటు దేశంలో పలు ప్రాంతాలను కుదిపేసిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించింది.
బెంగళూరు: హిజాబ్ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించింది. ముస్లిం సాంప్రదాయం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. యూనిఫాం ధరించాలని చెప్పే హక్కు విద్యాసంస్థలకు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు తమకు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముస్లిం బాలికలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కొట్టేసింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాన్ని పిటిషనర్లకు కల్పించింది. హిజాబ్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి చదివి వినిపించారు.
ఉడుపిలోని ఓ స్కూల్లో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో ఈ వివాదం మొదలైంది. ఇది మెల్లగా రాష్ట్రం, దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపించింది. హిజాబ్‌ను నిరసిస్తూ కొందరు హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో వివాదం ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్‌తోపాటు ఎలాంటి మత సంబంధమైన దుస్తులు ధరించకూడదని నిషేధం విధించింది. దీనిని సవాలు చేస్తూ పలువురు ముస్లిం విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిషేధాన్ని సమర్థించింది.
మంగళవారం కోర్టు తీర్పు వెలువరించడానికి ముందు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. ఉడుపిలో 144 సెక్షన్ విధించడంతోపాటు స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. ఇటు బెంగళూరు, మంగళూరుల్లో వారం రోజుల పాటు భారీ ప్రదర్శనలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.