Karnataka: కర్నాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న ‘ముడా భూ కుంభకోణం’
కర్నాటకలో మరో రాజకీయ దుమారం తలెత్తింది. ముడా భూ కుంభకోణంలో సీఎం సిద్ధ రామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతిని ఇచ్చారు. ఈ కేసులో సీఎంను విచారించడానికి అనుమతించవద్దని కర్నాటక మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ పట్టించుకోలేదు.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ శనివారం అనుమతి ఇచ్చారు. ఇది కర్నాటకలో రాజకీయంగా మరో దుమారానికి తెర తీసింది.
ఏమిటీ కుంభకోణం..
కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి వారి పుట్టింటి తరఫున వచ్చిన 3 ఎకరాల భూమిని మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) సేకరించింది. ఆ సేకరించిన భూమికి బదులుగా సిద్ధరామయ్య భార్య ముడా నుంచి, వేరే ఖరీదైన ప్రాంతంలో అధిక విలువైన ప్లాట్లు పొందారన్న ఆరోపణలపై అధికారిక దర్యాప్తునకు గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి పంపినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ధృవీకరించింది.
కోర్టు విచారణ
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సంబంధిత పిటిషన్ పై విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు గవర్నర్ అనుమతి అవసరమా అని తేల్చడానికి ప్రత్యేక కోర్టు తన విచారణను వాయిదా వేసింది. మైసూరులో అక్రమంగా భూమిని పొందడానికి సిద్ధరామయ్య తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్ లో ఆరోపించారు.
ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లు
సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన దేవనూర్-కేసరలోని 3.16 ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకుని.. అందుకు బదులుగా మైసూరులోని విజయనగర్ ప్రాంతంలో 14 ప్లాట్లను ఇచ్చిందని, ఈ విషయంలో సిద్ధరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్ లో ఆరోపించారు. ఆ ప్లాట్లను దక్కించుకోవడానికి సిద్ధరామయ్య తప్పుడు పత్రాలను సృష్టించారని స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధికారుల సహకారం
ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూరు డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ సహా పలువురు అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం విలువ రూ.3,000 కోట్లు అని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
రాజీనామా అవసరం లేదు..
తనపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని సిద్ధరామయ్య చెబుతున్నారు. ఈ అసత్య ఆరోపణలపై తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య రాజీనామా డిమాండ్ ను రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తోసిపుచ్చారు. గవర్నర్ అనుమతి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వాదించారు. ఈ పిటిషన్ లో విశ్వసనీయమైన ఆధారాలు లేవని, తప్పుడు ఆరోపణలతో కూడుకున్నదని పరమేశ్వర పేర్కొన్నారు.
సిద్ధరామయ్యపై ఆరోపణలపై కమిషన్ ఏర్పాటు
సీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేసే ముందు గవర్నర్ పిటిషన్ ను, పిటిషనర్ నేపథ్యాన్ని పరిశీలించారా? అని పరమేశ్వర ప్రశ్నించారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ కేసును కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉందని, తమ వాదనను ప్రజాకోర్టుకు కూడా తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు. దీనిపై విచారణ జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీఎన్ దేశాయ్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సంబంధించిన 3.16 ఎకరాల భూమికి సంబంధించిన కొనుగోలు, డీనోటిఫికేషన్, గిఫ్ట్, ఆక్రమణ, ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించడం కమిషన్ పని.