Siddaramaiah: ముడా కుంభకోణంపై లోకాయుక్త విచారణ; సిద్ధమేనంటున్న సిద్ధరామయ్య
ముడా స్థల కేటాయింపు కుంభకోణానికి సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కర్ణాటక ప్రత్యేక కోర్టు ఆదేశించింది. తానేం తప్పు చేయలేదని, లోకాయుక్త విచారణకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (MUDA) స్థల కేటాయింపు వివాదంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కర్ణాటక ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ కుంభకోణంలో తనపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సిద్ధ రామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ బుధవారం లోకాయుక్త విచారణకు ఆదేశించారు.
విచారణకు సిద్ధం
అయితే, ముడా కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, దానికి భయపడబోనని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17ఏ కింద తనపై దర్యాప్తునకు గవర్నర్ ఆగస్టు 16న అనుమతి ఇవ్వడంలోని చట్టబద్ధతను సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సిద్ధరామయ్య భార్య పార్వతికి ముడా అక్రమంగా 14 ప్లాట్లు కేటాయించిందనే ఆరోపణలప నేపథ్యంలో ముడా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రత్యేక కోర్టు చర్యలను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేయడంతో దర్యాప్తు ముందుకు సాగేందుకు మార్గం సుగమమైంది.
సీబీఐ విచారణ కావాలి
ప్రత్యేక న్యాయస్థానం లోకాయుక్త విచారణను ప్రకటించిన తర్వాత కూడా సిద్ధరామయ్యపై ముడా కుంభకోణానికి సంబంధించి కేసు వేసిన కార్యకర్త స్నేహమయి కృష్ణ సీబీఐ విచారణ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ‘‘కోర్టు లోకాయుక్త దర్యాప్తును ఆదేశించింది. కానీ, మేము సీబీఐ విచారణ కోరుకుంటున్నందున మేము కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తాము’’' అని స్నేహమయి తెలిపారు.
ముడా స్కామ్ కేసు
ఒక ప్రాజెక్టు కోసం భూమి కోల్పోవడంతో అందుకు పరిహారంగా మైసూరులోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో సిద్ధరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను ముడా కేటాయించిందన్న ఆరోపణలతో కర్నాటక (KARNATAKA) లో ముడా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ విలువ 3,000 కోట్లని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా, దళిత వర్గానికి చెందిన భూమిని సిద్ధరామయ్య ఆక్రమించుకున్నారని ఆరోపించాయి. ఈ ప్లాట్లను సిద్ధ రామయ్య భార్యకు అప్పగించడానికి ముడా నకిలీ పత్రాలు సృష్టించిందని ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సిద్ధరామయ్య బావ మలికార్జున స్వామి దేవరాజ్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రతిస్పందనగా, సిద్ధరామయ్య అన్ని ఆరోపణలను ఖండించారు. అన్ని చర్యలు చట్టబద్ధమైనవని పేర్కొన్నారు.
సీఎం సిద్ధరామయ్య ఏం చెప్పారు?
ముడా (MUDA) భూ కుంభకోణంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో బీజేపీ, జేడీ(ఎస్)లు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని సిద్ధరామయ్య ఆరోపించారు. భారతీయ జనతా పార్టీవి "ప్రతీకార రాజకీయాలు" అని అభివర్ణించారు. తనకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్నారు. లోకాయుక్త దర్యాప్తునకు సంబంధించి న్యాయ నిపుణులను సంప్రదిస్తానన్నారు.