Anantapur : అనంతపురం జిల్లాల్లో విషాదం.. ఇంటి మిద్దె కూలి కుమార్తె సహా దంపతులు మృతి
Anantapur : అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విషాద ఘటనలు జరిగాయి. ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో కుమార్తెతో సహా దంపతులు మృతి చెందారు. మరోక ఘటనలో షెడ్ పైకప్పు కూలి ఇద్దరు రైతులు ప్రాణాలు వదిలారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అనంతపుర జిల్లాలో ఇంటిపై కప్పు కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వ్యవసాయ తోట వద్ద నిర్మాణం చేపడుతున్న షెడ్ పైకప్పు కూలి ఇద్దరు రైతులు మరణించారు. మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఈ రెండు ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
అనంతపురం జిల్లా కుందర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకోంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రంపల్లి గ్రామానికి చెందిన గంగన్న (43), శ్రీదేవి (38) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఈశ్వర్ వ్యవసాయ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పెద్ద కుమార్తె మల్లేశ్వరికి కుందుర్పికి చెందిన శివకుమార్‌తో వివాహం అయింది. చిన్న కుమార్తె సంధ్య (14) తొమ్మిదో తరగతి చదువుతోంది.
పెద్ద కుమార్తె మల్లేశ్వరి, అల్లుడు శివకుమార్ మంగళవారం సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నారు. మంగళవారం రాత్రి మల్లేశ్వరి భర్తతో కలసి మెట్టినిల్లు కుందుర్పికి వెళ్లిపోయింది. ఆ తరువాత కుమారుడు ఈశ్వర్ టమాటా బాక్సులు లోడ్ చేసేందుకు వెళ్లగా.. గంగన్న, శ్రీదేవి, కుమార్తె సంధ్య ఒకే గదిలో నింద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి ముగ్గురిపై పడింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తున్న గంగమ్మ తల్లి ముత్యాలమ్మ.. ఉదయం 6 గంటలకు నిద్రిలేచి చూసే వరకు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు.
ముత్యాలమ్మ చూసి గట్టిగా కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. మట్టి మిద్దె కావడంతో కూలిన శబ్దం కూడా వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో రుద్రంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బాధిత కుటుంబానికి తక్షణసాయంగా రూ.50 వేలు అందించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను ఆదేశించారు.
సత్యసాయి జిల్లాలో..
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం శెట్టిపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు పైకప్పు కూలి ఇద్దరు రైతులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శెట్టిపల్లికి చెందిన రైతు శివారెడ్డి (50) తన పొలంలో పొగాకు పంట సాగు, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకోవడంతో పాటు పశువుల కోసం, కాపలాకు అనువుగా ఉండేలా షెడ్ నిర్మాణం చేపడుతున్నాడు. ఒకే రోజులో ఇటుకలతో గోడలు పూర్తి చేశారు. ఇనుప కడ్డీలను ఆసరాగా పెట్టి రాతి బండలతోపై నిర్మించేందుకు ప్రయత్నించారు. గోడలు క్యూరింగ్ కాకపోవడంతో పైకప్పు ఓ వైపు కుంగింది. దాన్ని జాకీలతో సరిచేసేందకు ప్రయత్నించారు.
శివారెడ్డి, ఆయన కుమారుడు రాజశేఖర్ రెడ్డి, రైతు బేల్దరి లక్ష్మినారాయణ రెడ్డి (45) కలిసి స్లాబ్ కింద భాగంలో కర్రలను అమరుస్తుండగా.. ఒక్కసారిగా స్లాబ్ మొత్తం వారిపై కూలిపోయింది. లక్ష్మినారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెండారు. శివారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హిందూపురం తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో శివారెడ్డి మృతి చెందారు. రాజశేఖర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో శెట్టిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)