Raliway Mutton curry: ఫేమస్ రైల్వే మటన్ కర్రీ రెసిపీ, అప్పట్లో ఈ కూర కోసం బ్రిటిష్ అధికారులు పడిగాపులు కాసేవారు
Raliway Mutton curry: రైల్వే మటన్ కర్రీ మన స్పెషల్ వంటకం. దీనికోసం బ్రిటిష్ అధికారులు కావాలని రైలు ఎక్కి ఆర్డర్ చేసుకొని తినేవారు. ఈ రైల్వే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు.
Raliway Mutton curry: రైల్వే మటన్ కర్రీ... ఒకప్పుడు చాలా ఫేమస్. స్వాతంత్య్రానికి పూర్వం రైళ్లలో పనిచేసే భారతీయ పనివాళ్లు దీన్ని మొదటిసారి వండారు. తమ కోసం తాము వండుకున్న ఈ కూరను ఓసారి బ్రిటిష్ అధికారులు రుచి చూసి దానికి దాసోహం అయిపోయారు. అప్పటినుంచి దీనికి రైల్వే మటన్ కర్రీ అనే పేరు పెట్టారు స్వాతంత్రానికి ముందు రైళ్లలో వంట చేసే వారిని ‘కాన్సామాలు’ అనేవారు. వారు రైళ్లలో ప్రయాణించే బ్రిటిష్ అధికారులకు వంటలు చేసి వడ్డించేవారు. పశ్చిమ రైల్వేకు చెందిన రైలులో తొలిసారి ఈ కూరను అధికారికంగా బ్రిటీష్ అధికారుల కోసం వండి వడ్డించడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్ల పాటు ఇలా నడిచింది. తర్వాత బ్రిటిష్ వారి శకం ముగియడంతో రైల్వే మటన్ కర్రీ దాదాపు అంతరించిపోయింది.
ఈ రైల్వే మటన్ కర్రీని రైల్వేలో పనిచేసే కాన్సామాలు తమ కోసమే వండుకునేవారు. ఓసారి అలా వండుకున్నప్పుడు ఓ బ్రిటిష్ అధికారి వంటగదిలోకి వచ్చాడు. ఉడుకుతున్న కర్రీ వాసన అతనికి చాలా నచ్చింది. రుచి చూసి అభిమాని అయిపోయాడు. వెంటనే రైల్వే మెనూలో చేర్చాలని చెప్పాడు. అలా మటన్ కర్రీ కాస్తా రైల్వే మటన్ కర్రీ గా మారి ఫేమస్ గా అయ్యింది.
రైల్వే మటన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ - ఒక కిలో
ఉల్లిపాయలు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - నాలుగు స్పూన్లు
టమోటాలు - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - రెండు
లవంగాలు - మూడు
బిర్యానీ ఆకు - రెండు
పసుపు - రెండు స్పూన్లు
ధనియాల పొడి - మూడు స్పూన్లు
కారం - ఒక స్పూన్
మిరియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - ఐదు స్పూన్లు
ఆవనూనె - అయిదు స్పూన్లు
పచ్చిమిర్చి - ఒకటి
గరం మసాలా - ఒక స్పూను
బంగాళదుంపలు - రెండు
రైల్వే మటన్ కర్రీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆవనూనె, నెయ్యి వేయాలి.
2. అవి వేడెక్కాక యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి అవి రంగు మారేవరకు వేయించాలి.
4. వాటిలో మటన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. చిన్న మంట మీద పెట్టి పైన మూత పెట్టాలి.
5. అలా పావుగంటసేపు ఉడకనివ్వాలి. తర్వాత టమోటో తరుగును, అల్లం వెల్లుల్లి పేస్టును, పచ్చిమిర్చిని వేసి బాగా కలపాలి.
6. బంగాళదుంపలను పెద్ద ముక్కలుగా కోసి వెయ్యాలి.
7. ఇప్పుడు మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి.
8. ఉల్లిపాయలు, టమోటోలు, మటన్ నుంచి నీరు ఎక్కువగా విడుదలవుతుంది. ఆ నీటిలోనే మాంసాన్ని ఉడకనివ్వాలి. ఈ కూరకి రుచి వచ్చేది అలాగే.
9. ఇప్పుడు ఆ కూరలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. అలాగే కారం కూడా వేయాలి.
10. పావుగంటసేపు చిన్న మంట మీద మళ్ళీ ఉడికించాలి. చివరిలో గరం మసాలా వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి.
11. మూత పెట్టి చిన్న మంట మీద మరొక 20 నిమిషాల పాటు ఉడికించాలి.
12. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే రైల్వే మటన్ కర్రీ రెడీ అయినట్టే.
13. దీన్ని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో తిన్నా కూడా అదిరిపోతుంది.
ఒకప్పుడు రైల్వే మటన్ కర్రీని వండే వారి సంఖ్య అధికంగా ఉండేది. కానీ ఇప్పుడు నిష్ణాతులైన వంటగాళ్ళు లేరు. దీన్ని వండే విధానం తెలుసుకొని ఇంట్లోనే అందరూ వండుకుంటున్నారు. వీలైతే మీరు ఒకసారి రైల్వే మటన్ కర్రీని వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.
టాపిక్