TG Local Body Elections : మద్యం మానేసిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో టికెట్లు : కాంగ్రెస్ ఎమ్మెల్యే-those who abstain from alcohol have the opportunity to contest local body elections said congress mla ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Local Body Elections : మద్యం మానేసిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో టికెట్లు : కాంగ్రెస్ ఎమ్మెల్యే

TG Local Body Elections : మద్యం మానేసిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో టికెట్లు : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Basani Shiva Kumar HT Telugu
Oct 03, 2024 10:22 AM IST

TG Local Body Elections : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్యపానం, ఇతర మాదకద్రవ్యాలు తీసుకోబోమని.. పార్టీ కార్యకర్తలు, యువతతో ప్రమాణం చేయించారు. మద్యం మానేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పారు.

ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు (@premsagarraok)

మద్యం మానేసిన వాళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని.. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ​నేతలు, కార్యకర్తలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఆదర్శంగా ఉండే కాంగ్రెస్ నాయకులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే కొందరు నాయకులు, యువతతో ప్రమాణం చేయించారు.

'కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలమైన మేము గాంధీ జయంతి సందర్భంగా.. మద్యం తాగం. డ్రగ్స్ ముటుకోం.. నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాం. కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా ఉంటాం. వర్గ విభేదాలు, కుల మత ద్వేషాలు, కక్షలు, గొడవలు లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములం అవుతాం. దేవుని మీద ప్రమాణం చేస్తున్నాం' అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రమాణం చేయించారు.

మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా.. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్ నేతృత్వంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతను భాగస్వామ్యం చేస్తూ.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దండేపల్లి చౌరస్తాలో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఈ ప్రతిజ్ఞ చేయించారు.

అటు.దండేపల్లి సహా మంచిర్యాల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. రాత్రి 9 తర్వాత మద్యం దుకాణాలు మూసివేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతిజ్ఞను ఉల్లంఘించినవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని, ఇతర పదవులు కూడా రావని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Whats_app_banner